స్థానిక పరిస్థితులపై ఈనెల 31లోపు నివేదిక
‘కొత్త మున్సిపల్ చట్టం’పై విస్తృత ప్రచారం
ముగ్గురు చొప్పున అభ్యర్థుల ప్రతిపాదన
టిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో దిశానిర్దేశం చేసిన కెటిఆర్
ప్రజాపక్షం/హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో పర్యటించి, అక్కడ టి ఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల పరిస్థితి, ఇతర అంశాలపై నివేదికను సమర్పించేందుకు టిఆర్‌ఎస్ ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్టు తెలిసింది. ఈ నెల 31వ తేదీలోపు ఆ నివేదికను సమర్పించాలని ఇన్‌ఛార్జ్‌లను టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆదేశించారు. ఎలాగూ అధికారంలో ఉన్నం కదా అని మున్సిపల్ ఎన్నికలను లైట్ తీసుకోవద్దని, అప్రమత్తంగా, సమన్వయంతో ముందుకు సాగాలని పార్టీ నేతలకు సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం కెటిఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్ని కలల్లో వ్యవహారించాల్సిన తీరుతెన్నులు, ప్రచార అంశాలు, వ్యూహరచణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్టు తెలిసింది. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో ముగ్గురు చొప్పున ఆశావాహుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ప్రధానంగా గెలుపు గుర్రాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎంఎల్‌ఎ, సీనియర్ నేతలు లేదా ఇన్‌చార్జ్‌లే దాదాపు అభ్యర్థిత్వాలను ఖారరు చేయాలని తెలిపినట్టు సమాచారం. వార్డు టికెట్టు ఆశించి భంగపడిన ఇతర రాజకీయ పార్టీల నేతలు, బలమైన నేతలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలని, వారికి పార్టీలో సరైన గౌరవం లభిస్తుందనే భరోస కల్పించాలని, మొత్తానికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో ఎక్కడా లోపాలు, సమన్వయ లోపం లేకుండా జాగ్రత్త పడాలని కెటిఆర్ తెలిపారు. కాగా మతాన్ని రెచ్చగొడుతున్న బిజెపిని తెలంగాణ ప్రజలు స్వాగతించబోరని, ఏదో అనుకోకుండ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 4 సీట్లు గెలుచుకున్నదని, ఇప్పుడు అంత సీన్ లేదని కెటిఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ప్రధానంగా కొత్త మున్సిపల్ చట్టంలోని భవన నిర్మాణ అనుమతుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రధానంగా 75 గజాల వరకు భవన నిర్మాణ అనుమతి అవసరం లేదనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయని టిఆర్‌ఎస్ భావిస్తుంది.