రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశాలు
ప్రజాపక్షం/హైదరాబాద్ లీగల్; రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు అంశాలపై రెండు వారాల్లోగా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి/కమిషనర్‌లను ఆదేశిస్తూ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచందర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లు, 53 మున్సిపాల్టీల పాలకవర్గాల గడువు వచ్చే జున్ 2తో ముగుస్తుందని, వాటికి ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లను ఖరారు చే యాల్సివుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు లో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ మేరకు చే యాలని ప్రభుత్వానికి రెండు లేఖలు కూడా రాశామని (మార్చి 14, మే 4 తేదీల్లో), వాటిపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఎస్‌ఈసీ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిని విచారించిన హైకోర్టు.. మున్సిపల్ వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారుపై రెండు వారాల్లోగా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని ఎస్‌ఈసీకి తెలియజేయాలని ఆదేశించింది. విచారణ వాయిదా పడింది.