ఈనెల 25 నుంచి ప్రారంభం
బయ్యారం నుంచి హన్మకొండ వరకు పాదయాత్ర
ఏప్రిల్ 9న తొలిసారిగా సిపిఐ, సిపిఐ(ఎం) ఉమ్మడి సభ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడి
ప్రజాపక్షం/ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఈనెల 25వ తేదీ నుండి సిపిఐ ఆధ్వర్యంలో బయ్యారం నుండి హన్మకొండ వరకు ‘సిపిఐ ప్రజా పోరు యాత్ర’ పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మొత్తం 12 రోజులు 770 కిలోమీటర్ల పాటు ఈ పాదయాత్ర సాగుతుందని వెల్లడించారు. హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావులతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాంబశివరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళు కావొస్తున్నప్పటికీ ఇప్పటివరకు పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించాలని, బొగ్గు గనుల ప్రైవేటటీకరణ నిలిపివేయాలని, తదితర డిమాండ్‌లతో తక్కెళ్ళపల్లి శ్రీనివాస్‌రావు నేతృత్వంలో పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25న బయ్యారంలో మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభ సూచికగా బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. పాదయాత్ర మధ్యలో పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమాలకు తనతో పాటు సిపిఐ పార్లమెంటరీ పార్టీ నాయకులు బినొయ్ విశ్వం, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ కేరళ ఎంపి సందోష్ కుమార్ తదితర జాతీయ నేతలు హాజరవుతారని కూనంనేని తెలిపారు. ఏప్రిల్ 5న హన్మకొండలోని ‘కుడా’ గౌండ్స్‌లో జరిగే భారీ ముగింపు సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ముఖ్యఅతిధిగా హాజరవుతారని చెప్పారు.
విభజన హామీలను తొమ్మిదేళ్ళైనా ఎందుకు అమలు చేయలేదు?
పునర్విభజన చట్టంలోని హామీల అమలులో బిజెపి నేతృత్వంలోకి కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, తొమ్మిదేళ్లు దాటినా ఎందుకు తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం లో 65 శాతం ఇనుప ఖనిజం ఉన్నదని, దాని ఆధారంగా స్టీల్ ప్లాంట్ పెట్టవచ్చని గతంతో కేంద్ర మంత్రి స్వయంగా పాల్వంచకు వచ్చి ప్రకటించారని, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైతం గనుల్లో ఇనుముపై సానుకూల నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. అయిన్పటికీ మోడీ ప్రభుత్వం ఒకసారి ఏర్పాటు చేస్తామని, మరోసారి కుదరదంటూ మాట మార్చిందన్నారు. కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తామని చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ సాకారం చేయలేదని, కేవలం ఓవర్ హాలింగ్ యూనిట్‌తో సరిపెట్టారని విమర్శించారు. అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్యను 119 నుండి 153 స్థానాలకు పెంచుతామని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామనే హామీలు నెరవేరనేలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణపై కన్నేసిన బిజెపి ఇప్పుడు పదేళ్ళ తరువాత రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, తెలుగు రాష్ట్రాల మధ్య హై స్పీడ్ రైల్వే లేన్ వేస్తామంటూ కల్లబొల్ల మాటలు చెబుతోందన్నారు. పైగా తొమ్మిదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం 7 ఐఐటిలు, 7 ఐఐఎంలు, 16 త్రిపుల్ ఐటిలు, 157 మెడికల్ కాలేజీలు, 50 కేంద్రీయ విద్యాలయాలు, 87 నవోదయ పాఠశాలలు మంజూరు చేసినప్పటికీ, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. అలాగే పునర్విభజన చట్టంలోని సెక్షన్ 46(2) ప్రకారం అపాయింటెడ్ డే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూలోటును భర్తీ చేస్తామని చెప్పారని, కానీ ఆ ఏడాది రూ.11వేల కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేయనేలేదన్నారు.
తొలిసారిగా ఉభయ కమ్యూనిస్టు పార్టీల కీలక ఐక్య సభ
తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ, సిపిఐ(ఎం)లు మరింత కలిసికట్టుగా కార్యాచరణతో పనిచేయాలని, ఎన్నికల్లో కచ్చితంగా కలిసి ఉండాలని నిర్ణయించాయని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 9న హైదరాబాద్‌లో సిపిఐ, సిపిఐ(ఎం)ల మండల పార్టీ నాయకత్వం మొదలు జిల్లా , రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఉమ్మడి సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కింది స్థాయి నుండి పైస్థాయి వరకు ఒకేసారి ఉభయ పార్టీల నాయకత్వం సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ సభకు సిపిఐ , సిపిఐ(ఎం) అగ్ర నాయకులు డి.రాజా, సీతారామ్ ఏచూరి, డాక్టర్ కె.నారాయణ, విజయ రాఘవన్, బి.వి.రాఘవులు హాజరవుతారని తెలిపారు.
గ్రూప్- 1 లో 90 మార్కుల లోపు అర్హులకు పరీక్ష రద్దు చేయొద్దు
టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 పేపర్ లీకేజీ వ్యవహారంలో చైర్మన్ జనార్ధన్‌రెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కావొచ్చని, కానీ ఆయన వైఫల్యం కనపడుతోందన్నారు. అంత సవ్యంగా జరిగినప్పుడు ఘనత మాది అని చెప్పుకుని, చెడు జరిగితే మాది కాదనేది సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరీక్ష రద్దు చేయడం సంతోషమని, కాని జరిగిన దానికి నైతిక బాధ్యత వహించి పొరపాటు అని చెప్పాలని కోరారు. మొత్త ం పరీక్షల రద్దు కంటే 90 మార్కులకు పైబడిన వారి మొత్తం ఫోన్‌లు, వాట్సాప్‌లు సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి, లబ్దిపొందిన వారివి రద్దు చేయాలన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో 90 మార్కుల లోపు వచ్చిన అర్హుల పరీక్షలను రద్దు చేయడం సమంజసం కాదన్నారు. లీకేజిలో నిందితుడు ప్రవీణ్ లాంటి వాళ్ళు ప్రస్తుత చట్టాలతో మళ్ళీ బైటకి వచ్చి యథేచ్చగా తిరుగుతారని, అలా కాకుండా లీకేజీ చేసిన వారికి ఐపిసి 302 తరహా శిక్షలు విధించేలా చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో కేవలం ఒకరిద్దరే ఇందులో ఉన్నారని వదలొద్దని, అందులో ఉన్న వారందరినీ బైటికి తీసుకురావాలని, లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సిసోడియా, కవిత బిజెపికి లొంగిపోతే కేసులు ఉండవు
దేశంలో సిబిఐ, ఇడిలను ప్రధాని మోడీ తన అమ్ములపొదిలో ఆయుధాలుగా మార్చుకుని, తన ఇష్టమొచ్చిన పద్ధతిలో దేశంలో అరాచకం చేస్తున్నారని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసులతో బైటికి రాకుండా చేశారని, ఇక మిగిలింది ఢిల్లీ, తెలంగాణ మాత్రమేనని చెప్పారు. అందుకే ఈ రాష్ట్రాల బలమైన పార్టీల నేతల వెంటపడుతున్నారన్నారు. ఢిల్లీలో సిసోడియా, తెలంగాణలో కవిత బిజెపికి లొంగిపోతే వారిపై ఏ కేసులు ఉండబోవనన్నారు. బిజెపిలో చేరితే ఎంతటి అవినీతిపరులైనా కేసులు ఉండవని, మొత్తం ఏకపక్షంగా ప్రతిపక్షాలపైనే కేసులను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఉండి బిజెపిలో చేరిన నారాయణ రాణే, హేమంత బిశ్వశర్మలపై కేసులు అటకెక్కాయన్నారు. వీరితో పాటు, యెడ్యూరప్ప, గాలి జనార్ధన్‌రెడ్డి వంటి అవినీతిపరులతో బిజెపి అవినీతిపుట్టలా తయారైందని విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, కాని కేవలం ప్రతిపక్షాలపై మాత్రమే వాటిని బిజెపి ప్రభుత్వం ప్రయోగిస్తున్నదన్నారు. ఆదానీ విషయంలో ఎందుకు చట్టాలను ప్రయోగించడంలేదని ఆయన నిలదీశారు. సాక్షాత్తు మోడీపైనే సహారా, బిర్లా సంబంధించి అవినీతి కేసులుఉన్నాయని, అమిత్ షా, ఆయన కొడుకుపై కేసులు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని, అప్పుడు అవినీతి కుంభకోణాలపై దర్యాప్తులో మోడీ, అమిత్ షా, బిజెపి నేతలు జైళ్ళకు వెళ్ళడం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రాలలో బిజెపిని ఓడించే బలమైన పార్టీకి సహకరించాలనేది సిపిఐ విధానమని, అలాగే దేశంలో బిజెపిని వ్యతిరేకించే పార్టీలను ఒక తాటిపై తీసుకువచ్చే పాత్ర పోషిస్తామని, ఆ పార్టీలలో కాంగ్రెస్ కూడా ఉంటుందని స్పష్టం చేశారు.
రైతులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకోవాలి: చాడ
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురిసిన ఈదురు, వడగండ్ల వర్షాలకు రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారని, తమది రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పే సిఎం కెసిఆర్ పెద్ద మనుసుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపుతో వేధించడం సరైంది కాదన్నారు.