ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో; ఏప్రిల్ మాసంలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. బలాబలాల రీత్యా రెండు స్థానాల్లోనూ అధికార పార్టీ టిఆర్‌ఎస్ మద్దతుదారులే విజయం సాధిస్తారు. ఎన్నికలు జరిగే పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన ఇద్దరు రాజ్యసభ సభ్యులైనట్లే. ఇప్పుడు చర్చ మాత్రం ఆ ఇద్దరు ఎవరన్నదే. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత సహా 50మందికి పైగా పేర్లు వినబడుతున్నాయి. 2018 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారు, పోటీ చేసి ఓటమి చవి చూసిన వారు ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు వినపడుతుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. పార్టీ విధేయుడిగా పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేశాడన్న పేరు ఉంది. కాబట్టి రాజ్యసభ రావచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశమవుతుంది. 2018 శాసనసభ ఎన్నికలకు ముందు పొంగులేటి, తుమ్మల ఇద్దరు టిఆర్‌ఎస్‌లో వర్గ నాయకులు. ఒకరు మంత్రిగా, మరోకరు ఎంపిగా వర్గ రాజకీయాలను ప్రోత్సహించారు. వెన్నుపోట్లో ఏ పోటు అయితేనేమి ఉమ్మడిజిల్లాలో టిఆర్‌ఎస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఖమ్మం మినహా మిగిలిన తొమ్మిది స్థానాల్లో టిఆర్‌ఎస్ ఓటమి చవి చూసింది. పలువురు నేతలపై వెన్నుపోటు ఆరోపణలు అధిష్టానానికి చేరాయి. కాంగ్రెస్ నుంచి నలుగురు, స్వతంత్ర అభ్యర్థి టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో సంఖ్యా బలం రీత్యా బలపడింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటిని కాదని అప్పుడే పార్టీలో చేరిన నామ నాగేశ్వరరావుకు టిఆర్‌ఎస్ టిక్కెట్ ఇచ్చి ఎంపిని చేశారు. ఆ సమయంలోనే పొంగులేటికి హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతుంది. జిల్లాలో ఎంపి ఎన్నికల తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. మంత్రి పదవీ పువ్వాడ అజయ్‌కుమార్‌కు దక్కడం ఆ తర్వాత వరుస విజయాలు పార్టీలో ఒక కొత్త కలయికకు దారితీశాయి. అజయ్‌కుమార్ అతి కొద్ది కాలంలోనే బలమైన నాయకునిగా ఎదగడంతో పాటు అందర్నీ కలుపుకుపోతూ అభిప్రాయాలను గౌరవిస్తున్నారన్న పేరు తెచ్చుకున్నారు. రాజ్యసభ పొంగులేటి, తుమ్మల్లో ఎవరికీ ఇచ్చినా మరోకరి సంగతి ఏమిటన్నది చర్చనీయాంశమైంది. ఒకరికీ రాజ్యసభ ఇచ్చి మరోకర్నీ వదులుకుంటారా లేక ఈ జిల్లా వైపు చూడకుండా పొంగులేటి, తుమ్మలను ఒకేరీతిగా చూస్తారా అన్నది తేలాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ క్లిష్ట సమయాలలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. రెండో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2018 నాటి పరిస్థితులు పునరావృతం చేస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. చర్చలకు, సందేహాలకు మార్చి ఆరున చెక్ పడనుంది.