పోటీలో కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు
భట్టి విక్రమార్క, మధు యాష్కీ కూడా
నేనూ రేసులో ఉన్నా: జగ్గారెడ్డి
నేతల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్
9న పిసిసి చీఫ్ కానున్న రేవంత్ అని పోస్టింగ్‌లు
రేపే కోమటిరెడ్డి పేరు ప్రకటించనున్నట్లు కౌంటర్‌లు
ప్రజాపక్షం / హైదరాబాద్ జిహెచ్‌ఎంసిలో ఘోర పరాజయం పొందినప్పటికీ కాంగ్రెస్‌లో పిసిసి అధ్యక్ష పదవి రేసు కాక పుట్టిస్తోంది. తన రాజీనామాను ఆమోదించి, తక్షణమే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని ప్రస్తుత చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధిష్టానానికి లేఖ రాయడంతో ఆ పదవి కోసం నాయకుల మధ్య ఒక్కసారిగా పోటీ పెరిగింది. ఈ పదవి కోసం ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, ఎంఎల్‌ఎ దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పేర్లు వినపడుతుండగా, తాజాగా కొత్త పేర్లు కూడా చేరాయి. సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, ఎఐసిసి కార్యదర్శి మధు యాష్కీగౌడ్ తెరపైకి వచ్చాయి. కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ఉత్తమ్ కోరిన వెంటనే ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా మారిపోయారు. రేవంత్‌రెడ్డి తన ప్రయత్నాలను మమ్మురం చేయగా, తెలంగాణ కోసం మంత్రి పదవిని వదలుకోవడంతో పాటు, ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ నుండి పార్టీ లో ఉంటూ, మూడు దశాబ్దాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన వంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. అదే సమయంలో మధ్యే మార్గంగా దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పేరునుకొందరు ముందుకు తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా, ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు కాంగ్రెస్ దూరమవుతుందని, వారిని అక్కున చేర్చుకునేందుకు ఆ వర్గాల నుండే పిసిసి చీఫ్‌ను ఎంపిక చేయాలని కోరుతున్నారు. ఇటీవల ఆ వర్గాలకు చెందిన సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. అందులో భాగంగా అవసరమైతే దళిత వర్గానికి చెందిన సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, బిసిల నుంచి అయితే మధు యాష్కీని పిసిసి అధ్యక్షునిగా చేయాలనే వాదన కొత్తగా తెరమీదకు తీసుకువచ్చారు. ఇంత మంది ఉన్నప్పటికీ, అందులో కూడా ఒకరికొకరు నీకు రాకుంటే నాకు అనే ఫార్ములాతో ముందుకు సాగుతున్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్నవారికే పిసిసి పదవి ఇవ్వాలనే వాదనను కూడా వారు బలంగా తెరమీదకు తీసుకువస్తున్నారు. నిన్న మొన్న వచ్చిన వారికి ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా వారే రకరకాల ప్రత్యామ్నాయాలను కూడా సూచిస్తున్నారు. మరోవైపు తాను రేసులో ఉన్నానని, సోమవారం నుండి ప్రయత్నాలు సాగిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.
మా నేతకే.. కాదు మా నేతకే..
ఇదిలా సాగుతుండగా రేసులో ఉన్న నాయకుల అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు పెడుతున్నారు. పిసిసి అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి పేరు ఖరారైపోయిందని, 8న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్‌కు వచ్చి ప్రకటన చేస్తారని, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని పోస్టింగ్‌లు పెడుతున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, ప్రచార కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్క అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిమానులు కోమటిరెడ్డి పేరే అధిష్టానం ఫైనల్ చేసేసిందని, నేడో రేపో ఉత్తరువులు వస్తాయని ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కోమటిరెడ్డి ఎక్కువ స్థానాలను గెలిపిచారని, ఆయనకు పిసిసి ఇవ్వడం ద్వారా పార్టీ పునర్వైభవం సాధిస్తుందనే ఎఐసిసి ఈ నిర్ణయం తీసుకున్నదని పోస్టింగ్‌లు పెడుతున్నారు. దీంతో పిసిసి ఛీఫ్ రేసు రసవత్తరంగా మారింది.
గాంధీభవన్‌లో నేతల హడావుడి
జిహెచ్‌ఎంసి ఎన్నికల తరువాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌కు రాకపోవడంతో మిగతా నేతల రాకతో గాంధీభవన్ హడావుడిగా కనిపించింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డిలు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారంతా భేటీ అయి, పిసిసి విషయంలో చర్చించుకున్నారు.