మరో ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరీ ఠాకూర్‌కు కూడా
పురస్కారాన్ని స్వీకరించిన కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవం శనివారం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాజీ ప్రధానులు పివి నర్సింహారావు, చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్నను ప్రదానం చేశారు. వీరి తరుపున వారి కుటంబ సభ్యులు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్రమోడీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భారత 9వ ప్రధానమంత్రిగా పివి నర్సింహారావు ఆర్థిక సంస్థరణలకు నాయకత్వం వహించారు. తాను యువకునిగా ఉన్నప్పుడు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా నిజాంపాలనలో హైదరాబాద్‌లో దుష్టపాలన, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనకు పలు భాషలు, సాహిత్యంపై మంచి పట్టు ఉన్నట్లు రాష్ర్టపతి భవన్ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. పివి తరుపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్‌రావు భారతరత్నను అందుకున్నారు. 1991 నుంచి 1996 వరకు పివి నర్సింహారావు ప్రధానిగా ఉన్నారు. రాజకీయాలలో పివిని చాణక్యుడు అని పిలిచేవారు. అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధాని అయిన మొదటి వ్యక్తి పివి. నెహ్రూ కుటుంబం వెలుపల నుంచి ఐదేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకున్న తొలి కాంగ్రెస్ నాయకుడు కూడా పివినే. 1990 ప్రారంభంలో భారతదేశాన్ని కల్లోల భరితమైన సమయంలో నడిపించిన వ్యక్తి పివి నర్సింహారావు. జూన్ 28, 1921న తెలంగాణలోని కరీంనగర్‌లో వ్యవసాయాధారిత కుటుంబంలో పివి జన్మించారు. 1980లలో వేర్వేరు సమయాల్లో కేంద్రంలో ముఖ్యమైన ఆర్థికేతర శాఖలు — విదేశీ వ్యవహారాలు, రక్షణ, హోమ్‌శాఖలను నిర్వహించారు. అతను డిసెంబర్ 23, 2004న తన 83వ ఏట మరణించారు. అదే విధంగా మరో ప్రధాని అయిన చౌదరి చరణ్‌సింగ్ తరుపున ఆయన మనవడు జయంత్ చౌదరి భారతరత్నను అందుకున్నారు. ‘పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాట్ నాయకుడు అయిన చౌదరి చరణ్ సింగ్ జులై 28, 1979, జనవరి 14, 1980 మధ్య ప్రధానిగా ఉన్నారు. అతను 1987లో మరణించారు. డిసెంబర్ 23, 1902న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని నూర్‌పూర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మరణానంతరం ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రదానం చేసినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. ‘ఆహార ఉత్పత్తిలో భారతదేశాన్ని స్వయం సమృద్ధి చేయడంలో స్వామినాథన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనను ‘భారత హరిత విప్లవ పితామహుడు’ అని పిలుస్తారు. ‘సతత హరిత విప్లవం’ అనే తన దృక్పథంతో సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించే పనిలో ఉన్నట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. స్వామినాథన్ తరుపున ఆయన కుమార్తె నిత్యారావు అవార్డును అందుకున్నారు. సెప్టెంబర్ 28, 2023న (98) మరణించిన స్వామినాథన్, 1960లలో ఆహార ధాన్యాల దిగుమతుల కోసం అమెరికాపై ఆధారపడిన కరువు పీడిత దేశం నుండి భారతదేశాన్ని ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ప్రకటించడానికి చాలా విస్తృతంగా కృషి చేశారు. తమిళనాడులోని కుంభకోణంలో ఆగస్టు 7, 1925న డాక్టర్ ఎంకె సాంబశివన్, పార్వతి తంగమ్మాయి దంపతులకు జన్మించిన స్వామినాథన్, రైతులు ప్రాచీన వ్యవసాయ పద్ధతులపై ఆధారపడిన సమయంలో వ్యవసాయ రంగ పథాన్ని మార్చడంలో గణనీయమైన పాత్ర పోషించారు. కాగా, రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ తరుపున ఆయన కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ భారతరత్నను అందుకున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. సోషలిస్ట్ ఐకాన్ ఠాకూర్ డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 వరకు, డిసెంబర్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫిబ్రవరి 17, 1988న ఠాగూర్ మరణించారు. ఇదిలా ఉండగా, ఈ సంవత్సరం, ప్రభుత్వం ఐదు భారతరత్న అవార్డులను ప్రకటించింది, అందులో ఒకటి బిజెపి (బిజెపి) ప్రముఖుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ ఉన్నారు.
పివికి భారతరత్న ప్రదానం
RELATED ARTICLES