ప్రజాపక్షం / జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి
పిడుగుపాటుకు ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుం ది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దాపూర్ గ్రామానికి చెందిన గట్టు మల్లేష్ భార్య గట్టు లక్ష్మి( 40) తన వ్యవసాయ పొలంలో కలుపు తీసేందుకు వెళ్లగా, ఇదే గ్రామానికి చెందిన పసరగొండ మంజుల (38) ను కూడా కూలికి తీసుకెళ్ళింది. సాయంత్రం సమయంలో వర్షం రావడంతో ఇద్దరు ప్లాస్టిక్ కవర్ కప్పుకుని గట్టుపై కూర్చున్నారు. వర్షంతో పాటు ఒక్కసారిగా పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన పక్క పంట పొలంలో పనిచేస్తున్న కూలీలు గ్రామస్థులకు సమాచారం అందించారు. సమాచారం తెలిసిన ములుగు సిఐ శ్రీధర్, వెంకటాపూర్ ఎస్‌ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనాధలైన పిల్లలు : పిడుగుపాటుతో మృతి చెందిన పసరగొండ మంజుల పిల్లలు అనాధలయ్యారు. మృతురాలు గట్టు లక్ష్మికి భర్త మల్లేష్, కుమారులు ప్రదీప్, పవన్, కూతురు ప్రవళిక, ఉన్నారు. మరో మృతురాలు పసరగొండ మంజులకు కూతురు సదా, కుమారులు సిద్దు, అరుణ్ ఉన్నారు. మంజుల భర్త పసరగొండ వెంకటేష్ గత 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కూతురు సదాకు వివాహం చేసింది. కాగా ఇప్పుడు ఇద్దరు కుమారులతో పాటు కూతురు అనాధలుగా మిగిలారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పిడుగుపాటుకు వ్యవసాయ కూలీలు మృతి
RELATED ARTICLES