పిఎస్‌ఎల్‌వి సి51లో అన్నీ ప్రైవేటు ఉపగ్రహాలే
శ్రీహరికోట: సమాచార ఉపగ్రహం సిఎంఎస్ 01ని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. కొవిడ్ 19 మహమ్మారి ప్రబలిన సమయంలో ఈ ఏడాది ఇది రెండోది, ఇంకా చివరి ప్రయోగం కూడా. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నమ్మినబంటు పోలార్ శాటిలైట్ లాంఛింగ్ వెహికిల్ పిఎస్‌ఎల్‌వి సి50 రాకెట్ ద్వారా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి సిఎంఎస్ 01 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం జరిగిన 20 నిమిషాలకు ఉపగ్రహం ముందుగా నిర్దేశించిన కక్ష్యలోకి చేరుకుంది. ఇక ఇస్రో సమాచార ఉపగ్రహాల్లో సిఎంఎస్ 01 42వది. భారత్ ప్రధాన భూభాగం, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులకు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో విస్తరించిన సి బ్యాండ్ సేవలను అందించడానికి సిఎంఎస్ ౦1 ఉపగ్రహాన్ని ఉద్దేశించారు. దీని కాల పరిమితి ఏడేళ్లని ఇస్రో తెలిపింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో అధ్యక్షుడు కె.శివన్ సంతోషం వ్యక్తం చేశారు. మరో నాలుగు రోజుల్లో సిఎంఎస్ 01ని నిర్దేశించిన జియో సింక్రనస్ ట్రాన్సర్ ఆర్బిట్‌లో (జిటిఒ) ప్రవేశ పెడతామన్నారు. పదకొండేళ్ల కిందట ప్రయోగించిన సమాచార ఉపగ్రహం జిశాట్ 12 స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు శివన్ తెలిపారు. ఈ ప్రయోగం కోసం పిఎస్‌ఎల్‌వి ఎక్స్‌ఎల్ రకం ఆరు స్ట్రాప్ ఆన్ బూస్టర్లు కలిగిన రాకెట్‌ను ఉపయోగించారు. ఈ తరహా రాకెట్ ప్రయోగాల్లో ఇది 22వది. శ్రీహరికోట నుంచి ఇది 77వ ప్రయోగం. నవంబర్ 7న ఇస్రో పిఎస్‌ఎల్‌వి సి49 రాకెట్ ద్వారా పర్యావరణ పరిశీలన ఉపగ్రహం, ఇఒఎస్ 01ని విజయవంతంగా ప్రయోగించింది. 2020 సంవత్సరానికి ఇస్రోకు ఇదే చివరి ప్రయోగం.
పిఎస్‌ఎల్‌వి సి51లో అన్నీ ప్రైవేటు ఉపగ్రహాలే
పిఎస్‌ఎల్‌వి సి51 ద్వారా ప్రైవేటు సంస్థలు నిర్మించిన ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు శివన్ వెల్లడించారు. దాంతో పిఎస్‌ఎల్‌వి సి51 తమకు, దేశానికి ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. తర్వాత ప్రయోగంలో పిక్సెల్ ఇండియా స్టార్టప్ తయారు చేసిన ‘ఆనంద్’ అనే భూ పరిశీలక ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నట్లు ఆయన తెలిపారు. దీనితోపాటు స్పేస్ కిడ్స్ ఇండియా నిర్మించిన ‘సతీశ్ శాట్’, కొన్ని విశ్వవిద్యాలయాలు కలిసి నిర్మించిన ‘యూనిట్ శాట్’ అనే ఉపగ్రహాలను కూడా ప్రయోగించనున్నారు. ఈ ఏడాది జూన్‌లో అంతరిక్ష కార్యకలాపాల్లోకి ప్రైవేటుకూ భాగస్వామ్యం కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిని “భారీ సంస్కరణ” అని పేర్కొన్నారు ఇస్రో అధ్యక్షుడు శివన్. అలా ప్రైవేటు రంగం కూడా అంతరిక్ష కార్యకలాపాల్లో ఇస్రోతో భాగస్వామి కానుందన్నారు.