HomeNewsBreaking Newsపిఎఫ్‌ఐ ఖాతాల్లోకి భారీగా నిధులు

పిఎఫ్‌ఐ ఖాతాల్లోకి భారీగా నిధులు

న్యూఢిల్లీ : పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలకు చెందిన ఖాతాల్లోకి భారీగా నిధులు జమ అయినట్టు సమాచారం. పిఎఫ్‌ఐ నాయకుల్లో ఒకరైన మహమ్మద్‌ షఫీక్‌ పయేత్‌ను కేరళలో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అదుపులోకి తీసుకున్న తర్వాత పలు అంశాలు వెలుగుచూశాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జారీ చేసిన ప్రకటనను అనుసరించి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 120 కోట్ల రూపాయలు ఈ సంస్థల్లో జమ అయ్యాయి. ఎక్కువ శాతం నగదు రూపంలోనే ఆయా ఖాతాల్లో జమ చేశారు. సుమారు పదహారు సంవత్సరాల క్రితం కేరళలో పురుడుపోసుకున్న పిఎఫ్‌ఐ సంస్థ కనీసం 15 రాష్ట్రాలకు విస్తరించిందని ఎన్‌ఐఎ సేకరించిన ఆధారాలను అనుసరించి స్పష్టమవుతున్నది. అణచివేతన ఎదుర్కోవడం, దోపిడీని అంతం చేయడమే లక్ష్యంగా పేర్కొంటున్నప్పటికీ, ఈ సంస్థ మతపరమైన ఘర్షణలను ప్రేరేపిస్తున్నదన్న అనుమానాలు ఉన్నాయి. అంతేగాక, ఒక వర్గం ప్రజలను మరో వర్గంపై దాడి చేసేందుకు ఉసిగొల్పుతున్నది. యువతకు తర్ఫీదునిచ్చి అల్లర్లను ప్రోత్సహిస్తున్నదని ఎన్‌ఐఎ ఇప్పటికే తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా వందకుపైగా అరెస్టులు జరగ్గా, అనుమానితులను విచారించిన తర్వాత సేకరించిన ప్రాథమిక సమాచారాన్ని అందులో పొందుపరచింది. కాగా, లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిసి), అల్‌-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలో యువతను చేరిపించేందుకు ఇటీవల అరెస్టయిన పది మంది పిఎఫ్‌ఐ కార్యకర్తలు, సానుభూతిపరులు ప్రయత్నించారని ఎన్‌ఐఎ ఆదివారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. ఇస్లామిక్‌ రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న హింసాత్మక జిహాద్‌ (పవిత్ర యుద్ధం)లో భాగంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడేందు కుట్రపన్నినట్టు తెలిపింది. దేశంలోని వివిధ మంతాలు, సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, సామర్యాన్ని దెబ్బతీసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కేరళలోని పిఎఫ్‌ఐ, అనుబంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఎన్‌ఐఎ
తన నివేదికలో వెల్లడించింది. గత గురువారం ఎన్‌ఐఎతో పాటు ఇడి, ఇతర దర్యాప్తు ఏజెన్సీలు పిఎఫ్‌ఐ ఆఫీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న 106 మందిని అరెస్టు చేశారు. వీరంతా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, వారికి శిక్షణ ఇవ్వడం, ఆయా సంస్థలో యువతను చేర్చుకోవడానికి ప్రయత్నించారని దర్యాప్తు ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. ఒకే సమయంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఈ దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా ఏజెన్సీలు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. వీటి ఆధారంగా అనుమానితులను ప్రశ్నించి, సమాచారం రాబడుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments