HomeNewsNationalపిఎం కిసాన్‌ పథకంలో మార్పు లేదు

పిఎం కిసాన్‌ పథకంలో మార్పు లేదు

కేంద్ర వ్యవసాయమంత్రి అర్జున్‌ ముండా
న్యూఢిల్లీ:
ప్రధాన మంత్రి కిసాన్‌ పథకంలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా వెల్లడించారు. ఈ పథకం కింద రైతులకు ఏటా అందచేస్తున్న రూ. 6,000 ఆర్థిక సాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని, అదే విధంగా మహిళా రైతులకు సైతం ఆర్థిక సాయాన్ని పెంచే ఆలోచన కూడా లేదని మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి స్పష్టం చేశారు. పిఎం కిసాన్‌ (కిసాన్‌ సమ్మాన్‌ నిధి) పథకాన్ని రూ.6,000 నుంచి రూ, 8,000- లేదా రూ.12,000 పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందా? అని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ప్రస్తుతం ఈ పథకం కింద రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలుగా రూ. 6,000 సహాయాన్ని ఏటా రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 15 వాయిదాలలో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2.61 లక్షల కోట్లను ఈ పథకం కింద అందచేసినట్లు ఆయన వివరించారు. సొంత భూమి ఉన్న రైతుల ఆర్థికావాలసరాలకు ఉపయోగపడడమే ఈ పథకం ఉద్దేశమని చెప్పారు. దళారీలు లేకుండా దేశవ్యాప్తంగా రైతులకు ఈ పథకం ప్రయోజనాలను నేరుగా డిజిటల్‌ మాధ్యమం ద్వారా అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 2,62,45,829 మంది రైతులు పిఎం కిసాన్‌ పథకం ద్వారా లబ్ధి పొందారని మరో ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి అర్జున్‌ ముండా తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన నిర్వహణా మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద లబ్ధిదారులను గుర్తించి, ధ్రువీకరించే బాధ్యత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదేనని మంత్రి స్పష్టం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments