పసుపు బోర్టును కొత్తగా ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించడం విడ్డూరం
టిపిసిసి అధ్యక్షుడు రేవంతరెడ్డి విమర్శ
ప్రజాపక్షం /హైదరాబాద్ మహబూబ్‌నగర్ పర్యటనలో తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ ఏ భరోసా ఇవ్వలేదని.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలనే నెరవేర్చలేదని టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంతరెడ్డి విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించకుండా, పసుపు బోర్డును ఏదో కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని మండిపడ్డారు. యుపిఎ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సైతం ప్రధాని అమలు చేయలేదని నిలదీశారు. గత ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన హామీలు ఆపుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై అక్కసు పెంచుకున్న మోడీని తెలంగాణకు పిలవడం ప్రజలని అవమాన పరచడమేననన్నారు. మోడీ చేసిన మోసానికి డికె అరుణ, కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కీగౌడ్, నాయకులు అంజన్ కుమార్ యాదవ్, జి.చిన్నారెడ్డి, పుష్పలీలలతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశే మిగిలిందని, మోడీ.. దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్‌కు ప్రధాన మంత్రా? అని రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివద్ధి చేయొచ్చు..మోడీ సభకు పరోక్షంగా సహకరించిన కెసిఆర్ కూడా దోషినే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోడీ తప్పుబట్టారు. అలాంటి మోడీ సభను పాలమూరు జిల్లాలో నిర్వహించినందుకు డికె అరుణ, జితేందర్ రెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. “తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోడీతో సభ నిర్వహించడం అనైతికం. వివేక్, కొండ విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, రాజ్ గోపాల్ రెడ్డి అందుకే రాలేదు అనే చర్చ నడుస్తోంది. మోడీ పర్యటన ఖర్చు కూడా పాలమూరుకు ఇవ్వలేదు. రాష్ట్రంలో కుటుంబ దోపిడీ గురించి మోడీ ఎందుకు మాట్లాడలేదు?. దీంతో.. బిఆర్ఎస్- మధ్య చీకటి ఒప్పందం జరిగిందని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది’ అని రేవంత్ అన్నారు. కెసిఆర్ కుటుంబం అవినీతిని బయటకు తీస్తామని ప్రజలకు మోడీ ఎందుకు హామీ ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోడీ పర్యటనలన్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, మోడీ పరోక్షంగా బిఆరెస్ను గెలిపించాలని చూస్తున్నారని” రేవంత్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్, టిఆర్ఎస్ మ్యానిఫెస్టోలపై చర్చకు సిద్దమా?
కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఇద్దరు ఏకమై చేస్తున్న పర్యటనలు ఇవి. కెటిఆర్, హరీష్ రావు బిల్లా రంగాల్లా తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 2004,2009 కాంగ్రెస్ మ్యానిఫెస్టో తో తాను వస్తానని, 2014,18 మ్యానిఫెస్టోలతో చర్చలకు వస్తారా? రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివద్ధిపై చర్చకు సిద్ధమా? అని బిఆర్ఎస్ మంత్రులకు సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్ లో బహునాయకత్వం ఉంటే తప్పేంటి?. బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తే తప్పేముంది?. అయినా రాజస్థాన్, ఛత్తీస్గడ్, కర్ణాటకలో సిఎంలు మారారా? మాట ఇస్తే అమలు చేసే పార్టీ కాంగ్రెస్.. ఆనాడు అమలు చేశాం. ఇప్పుడూ ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తాం. కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతికత బిల్లా రంగాలకు లేదు. తెలంగాణ సమాజం కెసిఆర్‌ను నమ్మదు.. క్షమించదు. కర్ణాటక ప్రభుత్వం వసూళ్లపై కెటిఆర్‌కు అనుమానం ఉంటే విచారణకి లెటర్ రాస్తే దాన్ని ఆమోదించి విచారణ చేయించాలని నేను కర్ణాటక ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వసూళ్లపై విచారణ జరిపించాలని లెటర్ రాస్తాను. ఆమోదించి విచారణ జరిపిస్తారా? అని రేవంత్ నిలదీశారు. అలాగే.. ఓట్ల కోసమే కెటిఆర్ దివంగత ఎన్టిఆర్ పేరును వాడుకుంటున్నాడంటూ విమర్శించారు రేవంత్. “ఎన్టిఆర్ పేరుతో ఓట్లు దండుకోవాలని బిఆర్ఎస్ చూస్తోంది. మీ దోపిడీకి ఎన్టిఆర్ పేరును వాడుకుంటారా? ఎన్టిఆర్ పేరుతో పోల్చుకునే అర్హత కెటిఆర్ కు లేదు. ఎన్‌టిఆర్‌తో పోల్చుకునే అర్హత బిఆర్ఎస్లో ఎవరికీ లేదు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వరా?
RELATED ARTICLES