కరోనాబారిన పడిన జర్నలిస్టులు చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోరా?
జర్నలిస్టుల సత్యాగ్రహంలో ఐజెయు అధ్యక్షులు కె. శ్రీనివాస్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ “ప్రజలకు సమాచారం అందిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిలబడుతున్న జర్నలిస్టులు రాలిపోతుంటే పాలకులు పట్టించుకోరా? కరోనా బారిన పడి 12 మంది జర్నలిస్టులు చనిపోతే ప్రభుత్వాలకు, పాలకులకు సిగ్గు శరం లేకుండా పోయిందా అనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులు చనిపోతే ఇలా నే ఉంటారా? ముఖ్యమంత్రిని కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నానని” ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ఐజెయు జాతీయ స్థాయి పిలుపు మేరకు శుక్రవారంనాడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు తెలంగాణ రాష్ర్ట వర్కింగ్ జర్నలిస్టుల సం ఘం (టియుడబ్ల్యుజె) ఆధ్వర్యంలో జర్నలిస్టులు తమ డిమాండ్ల సాధనకై హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద సత్యాగ్రహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు)అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి ప్రసంగిస్తూ సమాచారాన్ని అందించే పావురాలు, ఫోర్త్ ఎస్టేట్‌కు చెందిన 12 మంది జర్నలిస్టులు రాలిపోతుంటే ప్రజాస్వామ్యం గుర్తు రావడం లేదా? ఓట్లు కొనడం ద్వారానే పాలన కొనసాగిస్తున్నారా? అని నిలదీశారు. నిరసనలో కూర్చున్నవారంతా తెలంగాణ కోసం పోరాడిన వారే కదా? మీ సొంత పత్రిక, టివికి చెందిన వారు కూడా చనిపోతుంటే కనికరం లేని కర్కశ హృదయంగా ఎందుకు మారిపోయారని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా గుర్తింపబడిన ఒక వ్యవస్థ కూలిపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిరసన తెలియజేసేందుకు ప్రయత్నం చేసిన ప్రతిసారీ ప్రెస్ అకాడమీ తాము రూ.20వేలు ఇస్తున్నామంటూ ప్రకటనలు చేయడం సిగ్గుగా ఉన్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం జర్నలిస్టుల విషయంలో మొండి చేయి చూపుతున్నదని, స్వయంగా ప్రధాని మోడీ జర్నలిస్టులను కరోనా వారియర్స్ అన్నారని, కానీ సాయం మాత్రం అందించడం లేదని విమర్శించారు. జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ అకాడమీ ప్రకటన చేసిందని, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.15 లక్షలు ప్రకటించిందని, ఒడిశా, చత్తీస్‌గఢ్ , తమిళనాడు ప్రభుత్వాలు కూడా సాయం ప్రకటించాయని తెలిపారు. కాని ఆదర్శరాష్ట్రంగా, బంగారు తెలంగాణగా చెప్పుకుంటూ అందరినీ ఆదుకుంటామని చెప్పుకునే మీరు.. జర్నలిస్టుల విషయంలో ఎందుకు నిరాకరణ భావంతో ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలు ఎంత నిరాకరించినా, వ్యతిరేకించినా, దమననీతిని ప్రకటించినా ప్రజాస్వామ్య పరిరక్షణకు, కర్తవ్య నిర్వహణకు జర్నలిస్టులు వెనుకంజ వేయబోరని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఐజెయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టంలో కరోనాతో మనోజ్ కుమార్ అనే మొదటి జర్నలిస్ట్ మరణిచినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టామని, మృతుల సంఖ్య నేటికి 12కు పెరిగినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. అలాగే 1100 మంది జర్నలిస్టులు, 2600 మంది కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత వైద్యం అమలు కావడం లేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె డిప్యూటీ జనరల్ సెక్రటరీ విష్ణుదాసు శ్రీకాంత్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగ శంకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కె.శ్రీకాంత్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్ రెడ్డి,బాలరాజు,తెలంగాణ రాష్ర్ట ఫోటో జర్నలిస్టుల సంఘం కార్యదర్శి కె. ఎన్.హరి,అనిల్, టియుడబ్ల్యుజె రాష్ర్ట నాయకులు ఎ. రాజేష్, జిల్లా నాయకులు వెంకటాచారి, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు ధర్నాలు
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజెయు) పిలుపు మేరకు మహాత్మాగాంధీ 151వ జయంతి రోజున దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ‘నిరసన దినాన్ని’ పాటించారు. కొవిడ్ నేపథ్యంలో జర్నలిస్టులను ఆదుకోవాడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఐజెయు కార్యవర్గం నిరసనకు పిలుపునిచ్చింది. పలు రాష్ట్రాలలో, రాజధాని నగరాల్లో, జిల్లాల్లో వర్కింగ్ జర్నలిస్టులు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించి, కలెక్టర్‌లకు వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్‌లో టియుడబ్ల్యుజె నిర్వహించిన సత్యాగ్రహ కార్యక్రమంలో ఐజెయు అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. చండీగఢ్‌లో పంజాబ్, చండీగఢ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు నిర్వహించిన నిరసనలో ఐజెయు సెక్రెటరీ జనరల్ బల్వీందర్ సింగ్ జమ్మూ, ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో విజయవాడ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో ఐజెయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా, కరోనా సోకిన జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు అందించాలని నిరసనలో పాల్గొన్న జర్నలిస్టులు డిమాండ్ చేశారు. కొవిడ్ సాకుతో చట్టాలకు భిన్నంగా జర్నలిస్టుల వేతన కోతలు, తొలగింపులకు పాల్పడిన యాజమాన్యాలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పాలకులకు… సిగ్గు శరం ఉందా?
RELATED ARTICLES