రాష్ర్ట అధికారులకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆదేశం
సిఎస్‌లు, డిజిపి, సిఇఒలు, ఐటి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
ప్రజాపక్షం / హైదరాబాద్ : గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా, ఎటువంటి ఘటనలు జరగకుండా నిర్వహించామని, అదే స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె.జోషి తెలిపారు. ఢిల్లీ నుండి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా సోమవారం వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపి, సిఇఒలు, ఐటి, ఇతర అధికారులతో పార్లమెంటు ఎన్నికల ఏర్పాట్ల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, సిఇఒ రజత్ కుమార్, ముఖ్యకార్యదర్శులు సోమేశ్ కుమార్, రాజీవ్ త్రివేది, అడిషనల్ డిజి జితేందర్, ఎన్నికల అధికారులు ఆమ్రపాలి, సత్యవాణి, ఐటి అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ స్టేషన్‌లో అన్ని వసతులు కల్పిస్తామని సిఎస్ జోషి తెలిపారు. వికలాంగులకు పోలింగ్ స్టేషన్‌లలో వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ప్రథమ అవార్డు పొందిందని భారత ఎన్నికల సంఘం అధికారులకు సిఎస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు త్వరలోనే రాష్ట్రాలను పర్యటిస్తారని సిఎస్ చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 22న ప్రచురిస్తారన్నారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులతో వచ్చే నెల 5 న సమావేశం జరుగనున్నదని కేంద్ర ఎన్నికల అధికారులకు వివరించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ ను కేటాయిస్తామన్నారు. రాష్ర్ట డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించామని, పంచాయతీ ఎన్నికలు 2 దశలు పూర్తయ్యాయని, మూడవ దశ ఈనెల 30న జరుగనున్నదని, పార్లమెంటు ఎన్నికలను కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకుండా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నక్సల్స్ ప్రభావంపై ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్టలతో ప్రత్యేక దృష్టితో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామన్నారు. అంతర్రాష్ర్ట చెక్‌పోస్టుల ఏర్పాటు, గత ఎన్నికల కేసుల పరిష్కారానికి చర్యలు, సమాచార మార్పిడి తదితర అంశాలపై వారికి వివరించారు.