- ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళన
- కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్
- కొనసాగిన వాయిదాల పర్వం
- న్యూఢిల్లీ : అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలిపు ప్రక్రియపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది. ఉభయసభల్లోనూ గురువారం ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అమెరికా 104 మందిని స్వదేశానికి పంపించడంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో లోక్సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. కాగా, ఉదయం లోక్సభ ప్రారంభంకాగనే భారతీయుల తరలింపుపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సభ్యులను శాంతింపజేసేందుకు స్పీకర్ ఓమ్బిర్లా తీవ్రంగా ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనను ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటుందని చెప్పారు. ఈ అంశం చాలా సున్నితమైనదని, పైగా విదేశీ విధానానికి సంబంధించినదని, అందవల్ల ప్రభుత్వం చాలా తీవ్రంగా సీరియస్గా తీసుకుంటుందని చెప్పారు. విదేశానికి కూడా సొంతంగా నియమ, నిబంధనలు ఉన్నాయన్నారు. తమ సమస్యలను మధ్యాహ్నం 12 గంటల తరువాత లేవెత్తవచ్చని, ముందుగా ప్రశ్నోత్తరాలను సజావుగా జరుపుకుందామని స్పీకర్ బిర్లా విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాలు చాలా ముఖ్యమైనవని, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు సభ్యులను ఎన్నుకున్నారని, కానీ, మీరు ఆందోళనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపి కీర్తి ఆజాద్ మొదటి ప్రశ్నను అడగగా, బిర్లా మాట్లాడుతూ, ‘మీరు మీ సహచర పార్టీ సభ్యుడు తన సమస్యలను లేవనెత్తడానికి అనుమతించడం లేదు. క్రమపద్ధతిలో సభను అంతరాయం కలిగిస్తున్నారు. ఇది మంచిది కాదు’ అని స్పీకర్ పేర్కొన్నారు. అయితే స్పీకర్ విజ్ఞప్తిని ఏ మాత్రం లెక్క చేయకుండా సభ్యులు ఆందోళనను కొనసాగిస్తుండగా, తొలుత సభను బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తరువాత సభ తిరిగి ప్రారంభమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రెండవసారి సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఆ తరువాత కూడా ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. సభ్యుల నినాదాల మధ్యే పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జోక్యం చేసుకుని విదేశాంగ మంత్రి జయశంకర్ మధ్యాహ్నం 3.30 తరువాత సభలో ప్రకటన చేస్తారని సమాచారమిచ్చారు. స్పీకర్ స్థానంలో ఉన్న దిలీప్ సైకియ సభను వాయిదా వేశారు. తిరిగి 3.30 గంటలకు సభ ప్రారంభం కాగానే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా నుంచి భారతీయల తరలింపు అంశంపై ప్రకటన చేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. అయితే జైశంకర్ ప్రకటన చేస్తున్నప్పుడు కూడా, విపక్ష సభ్యులు ఈ విషయంపై నినాదాలు చేస్తూ నిలబడ్డారు. ఈ నినాదాల మధ్య, విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ‘తిరిగి వస్తున్న అక్రమవలసదారుల పట్ల విమానంలో ఏ విధంగానూ దురుసుగా ప్రవర్తించకుండా చూసుకోవడానికి తాము అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాము’ అని అన్నారు. ‘అదే సమయంలో, చట్టబద్ధమైన ప్రయాణికులకు వీసాలను సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటూనే అక్రమ వలస పరిశ్రమపై బలమైన అణిచివేతపై దృష్టి సారించాలన్నారు. అయితే తరలింపు ప్రక్రియ కొత్తది కాదని, గతంలో కూడా ఇలాగే జరిగిందని జైశంకర్ అన్నారు. అంతకు ముందు ఈ అంశంపై రాజ్యసభలో కూడా ఆయన ప్రకటన చేశారు.
రాజ్యసభలోనూ అదే తీరు
యుఎస్ నుంచి భారతీయుల తరలింపు అంశంపై రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సభ పలుమార్లు వాయిదా పడింది. అయితే చైర్మన్ జగదీప్ ధన్ఖర్ స్పందిస్తూ మధ్యాహ్నం 2 గంటల తరువాత విదేశాంగమంత్రి జైశంకర్ సభలో ప్రకటన చేస్తారని చెప్పారు. సభ వాయిదా పడడానికి ముందు ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. కాగా, సభా కార్యక్రమాలను రద్దు చేసి భారతీయుల తరలింపు అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్, సిపిఐ,టిఎంసి, ఆప్, సిపిఐ(ఎం) 267 నిబంధన కింద వాయిదా తీర్మానాలు ఇవ్వగా, చైర్మన్ వాటిని తిరస్కరించారు. సిపిఐ సభ్యుడు పి. సందోశ్ కుమార్, టిఎంసి సభ్యుడు సాకెత్ గోఖలే, సిపిఐ(ఎం) ఎంపి వి. శివదాసన్, కాంగ్రెస్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శక్తిసిన్హ గోహిల్, ప్రమోద్ తివారి, రేణుకా చౌదరి, అశోక్ సింగ్ ఉన్నారు.