రైతుల సమస్యలపై దద్దరిల్లిన ఉభయసభలు
12 మంది ఎంపిల సస్పెన్షన్‌పై తొలగని ప్రతిష్టంభన
సభ నిర్వహణ తీరుపై ప్రతిపక్షాల మండిపాటు
ప్రజా సమస్యలపై చర్చకు తిరస్కరించారు : ప్రతిపక్షం
చివరిరోజు మోడీ, సోనియా ప్రభృతుల హాజరు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారంనాటితో ముగిశాయి. ఉభయసభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. నవంబరు 29 నుండి డిసెంబరు 22 వరకూ 18 రోజులపాటు జరిగిన సమావేశాల్లో రైతుల సమస్యలు, 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ సమస్య ప్రధానంగా పార్లమెంటు సమావేశాలను చివరి వరకూ కుదిపేశాయి. దీనిపై ప్రతిష్టంభన తొలగిపోలేదు. లఖింపూర్ ఖేరి హింసాకాండలో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తేని నేరస్తుడని ఆయన్ను తక్షణం మంత్రివర్గం నుండి తొలగించాలని కాం గ్రెస్ సారధ్యంలో ప్రతిపక్షాలు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ, పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభామధ్యస్థలంలోకి దూసుకువచ్చిన సంఘటనలు కూడా దేశం దృష్టి ని ఆకర్షించాయి. అయినప్పటికీ ఈ సమస్యలన్నిటిపైనా ప్రభుత్వం ఏ మాత్రం పట్టువిడుపులు ప్రదర్శించకుండా తన మొండి వైఖరిని కొనసాగించింది. ప్రతిపక్షాల గళాన్ని, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉభయసభలను ప్రభుత్వం నడిపించిన తీరుపై ప్రతిపక్షాలు అసంతృప్తి, తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కార్మిక సమస్యలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, కరోనాకాలంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తెన్నులు, బడుగు, వలస కార్మికులకు జరిగిన అన్యాయం వంటి అనేక సమస్యలపై చర్చించేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రతిపక్షసభ్యుల సస్పెన్షన్ రద్దు డిమాండ్ సహా ప్రజా సమస్యలపై చర్చకు తిరస్కరించడం ద్వారా అధికారపక్షం తనకు అనుకూలంగా సభను నడిపించుకుని అప్రజాస్వామికంగా ప్రవర్తించిందని, ఏకపక్ష నియంతృత్య పోకడలకు తెర లేపిందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. కాగా ఈ సమావేశాల్లో ఉభయసభలూ 11 కీలక బిల్లులను ఆమోదించాయి. యువతుల వివాహ వయసు 21 సంవత్సరాలకు పెంచేందుకు ఉద్దేశించిన బాలికా వివాహాల నిషేధ సవరణ బిల్లు, సిఎ, కాస్ట్ అకౌంట్స్, కంపెనీ సెక్రటరీల నియంత్రణ సవరణ బిల్లు సహా ఐదు బిల్లులను పార్లమెంటు స్థాయీ సంఘాల పరిశీలనకు పంపించగా, జీవవైవిధ్య సవరణ బిల్లు పార్లమెంటు ఉభయసభల సంయుక్త కమిటీ పరిశీలనకు పంపించింది. ఓటర్లజాబితాకు ఆధార్‌ను అనుసంధానం చేసే ఎన్నికల చట్టాల సవరణ బిల్లు, సిబిఐ, ఇ డి అధిపతుల పదవీకాలం ఐదేళ్ళకుపెంచే సవరణ బిల్లు, అద్దెగర్భం నియంత్రణ, సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణ బిల్లులు ఉభయసభలూ ఆమోదించిన 11 బిల్లుల్లో ప్రధానంగా ఉన్నాయి. సప్లిమెంటరీ డిమాండ్ల గ్రాంట్లకు ఆమోదం తెలిపింది.153 ప్రైవేటు తీర్మానాలను సభ ఆమోదించింది. కాగా ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీ బిల్లు, రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టలేదు. అయితే ముందుగా ప్రకటించిన విధంగా పార్లమెంటు సమావేశాలు డిసెంబరు 23 వరకూ జరగాల్సి ఉన్నప్పటికీ, ఒక రోజు ముందుగానే ముగిశాయి.
లోక్‌సభలో 82 శాతం ఉత్పాదకత ః ఓం బిర్లా
ఈ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ 83 గంటల 12 నిమిషాలపాటు సభా కార్యకలాపాలను నిర్వహించింది. లోక్‌సభ సమావేశాలు లక్ష్యసిద్ధి పరంగా 82 శాతం ఉత్పాదకత సాధించిందని స్పీకర్ ఓం బిర్లా బుధవారం ముంగిపు సభలో వెల్లడించారు. చివరి రోజు బుధవారంనాటి సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. సభ నిరవధిక వాయిదా అనంతరం వివిధ పార్టీల సభానాయకులు లోక్‌సభ స్పీకర్‌ను ఆయన ఛాంబర్‌లో కలుసుకుని మాట్లాడారు. ఈ సమస్యలపై తగినవిధంగా చర్చ జరిపేందుకు, ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఆమోదించి సమగ్ర చర్చ జరిపేందుకు ప్రభుత్వం తిరస్కరించడంతో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మౌలిక సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం మూకబలంతో ప్రవర్తించిందని ప్రతిపక్ష ఎంపీలు నిశిత విమర్శ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, లఖింపూర్ ఖేరిజిల్లాలో రైతులపై మారణకాండ, ఈ ఘటనపై చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేటుకు ‘సిట్’ పమర్పించిన నివేదిక, 12 మంది ప్రతిపక్ష ఎంపీలను రాజ్యసభ నుండి సస్పెండ్ చేయడం, సిబిఐ, ఇడి అధిపతుల పదవీకాలం ఐదేళ్ళకు పెంపు, ధాన్యం కొనుగోలుకు జాతీయ విధానం అనుసరించాలన్న డిమాండ్ ప్రధానంగా లోక్‌సభను కుదిపివేశాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేని ని క్యాబినెట్ నుండి తొలగించాలని, ఆయన నేరస్తుడని పేర్కొంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఈ సమావేశాల్లో ధ్వజమెత్తింది.
18.48 గంటల సమయం వృథా
కరోనా మహమ్మారిపై 12 గంటల 26 నిమిషాలు, వాతావరణ మార్పులు సమస్యలపై ఆరు గంటల 26 నిమిషాలసేపు ఈ సమావేశాల్లో చరచలు జరిగాయి. కరోనా మహమ్మారి, ప్రబుత్వం తీసుకున్న చర్యలు అనే అంశంపై జరిగిన చర్చలో 99 మంది సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే వాతావరణ మార్పులపై జరిగిన చర్చ అసంపూర్ణంగానే మిగిలిపోయింది. కేవలం 61 మంది సభ్యులు మాత్రమే ఈ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. బుధవారంనాడు లోక్‌సభ సభ స్పీకర్ ఓం బిర్లా సభ ముగింపు సందర్భంగా మాట్లాడుతూ, సభ తీవ్ర ఆటంకాల కారణంగా 18 గంటల 48 నిమిషాల సమయం వృథా అయిందని చెప్పారు. అయితే డిసెంబరు 2వ తేదీన సభా కార్యకలాపాల ఉత్పాదకతా లక్ష్యం అత్యధికంగా 204 శాతంగా నమోదైనట్లు ప్రకటించారు. ఆ రోజు కరోనా మహమ్మారిపై సభ క్షుణ్ణంగా చర్చించిందన్నారు.
సస్పెన్షన్‌పై పంతం నెగ్గించుకున్న ప్రభుత్వం
రాజ్యసభ తీరుపై వెంకయ్యనాయుడు ఆవేదన
పదే పదే ఎదురైన ఆటంకాల వల్ల సభా కాలాన్ని నష్టపోయామని సభాధ్యక్షుడు ఎం వెంకయ్యనాయుడు బుధవారం చివరిరోజు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నిసార్లు అభ్యర్థించినా 12 మంది ప్రతిపక్ష ఎంపీలపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేయకుండా తన పంతం నెగ్గించుకుందని సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. సభలో ప్రతిరోజూ తీవ్ర గందరగోళం చెలరేగడంవల్లనే సభా కాలాన్ని రాజ్యసభ నష్టపోయిందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానిస్తూ, సభ 47 శాతం ఫలితాలను మాత్రమే సాధించిందని అన్నారు. రాజ్యసభ పనితీరు పట్ల తాను ఏ మాత్రం సంతోషంగా లేనని అన్నారు. సభాకార్యకలాపాలు అనుకున్నదానికంటే చాలా తక్కువ సామర్థ్యంతో జరిగాయన్నారు. “ఈ సభాకార్యకలాపాలు ఈ విధంగా కాకుండా ఉండి ఉంటే దాని ప్రభావం ఇంకెంత ఉత్తమంగా భిన్నంగా ఉండేదో సభ్యులు తమకు తాముగానే ఆత్మావలోకనం చేసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, సభ నడిచిన తీరు తెన్నుల గురించి మాట్లాడదల్చుకోలేదు, అలా మాట్లాడితే నా అభిప్రాయాలు చాలా విమర్శనాత్మకంగా ఉంటాయి అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, 18 రోజులపాటు జరిగిన రాజ్యసభ సమావేశాలకు హాజరు కాకుండా ప్రభుత్వం 12 మంది ప్రతిపక్ష ఎంపీలను నవంబరు 29వ తేదీ శీతాకాల సమావేశాల మొదటిరోజే తీర్మానం ద్వారా సస్పెండ్ చేశారు. వారిని తిరిగి సభకు అనుమతించాలని, సస్పెన్షన్ ఎత్తివేయాలని పదే పదే ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోకుండా పూర్తికాల సస్పెన్షన్‌ను అమలు చేసింది. దేశ పార్లమెంటు చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగాయి. అయితే పార్లమెంటు చరిత్రలో దశాబ్దాలుగా ఇది జరుగుతున్నదేనని వెంకయ్యనాయుడు సమర్థిస్తూ ప్రతిపక్ష సభ్యులను తిరస్కరించారు. అధికార ప్రతిపక్షాలు పరస్పరం చర్చించుకుని సస్పెన్షన్‌పై ఒక అవగాహనకు రావాలని ఆచరణ సాధ్యంకాని మెలికపెట్టి వెంకయ్యనాయుడు తప్పించుకున్నారు. ఈ ప్రతిపాదనను ప్రతిపక్షాలు నిర్దద్వంగా తిరస్కరించడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. దీంతో 12 మంది ఎంపీలు పార్లమెంటు భవన సముదాయంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకూ బైఠాయించి తమ నిరసన తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు వారికి సంఘీభావంగా గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. సస్పెండైన 12 మందీ క్షమాపణ చెప్పాలని వెంకయ్యనాయుడు కోరగా,చేయని తప్పుకు ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం ప్రశ్నించింది. గడచిన వర్షాకాలంనాటి సమావేశానికి సంబంధించిన అంశంపై ఈ శీతాకాల సమావేశాల్లో సభ్యులకు వ్యక్తిగతంగా పిలిచి తెలియజేయకుండా ససెన్షన్ అమలు చేయడం నిబంధనలకు విరుద్ధమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా
RELATED ARTICLES