అవిశ్వాస తీర్మానంపై 9న ఓటింగ్
స్పష్టం చేసిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు
జాతీయ అసెంబ్లీని పురుద్ధరించాలని ఆదేశం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు) రద్దును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈనెల 9వ తేదీన పార్లమెంటు సమావేశం జరపాలని ఆదేశించింది. జాతీయ అసెంబ్లీ రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పాకిస్తాన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అతా బాందియల్ స్పష్టం చేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటును నిర్వహించకుండా అడ్డుకోవడం ద్వారా పాక్ రాజ్యాంగంలోని 95వ అధికరణను జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి అతిక్రమించారని స్పష్టం చేశారు. ప్రధాని ఇమ్రాన్ కూడా తన పరుధులను అధిమగించి, పార్లమెంటు రద్దు కోసం దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వికి సిఫార్సు చేశారని బాందియల్ వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ఈనెల తొమ్మిదో తేదీ శనివారం పార్లమెంటు సమావేశం జరపాలని, అదే రోజున ఇమ్రాన్‌పై ప్రవేశపెట్టిన అవిశాఇ్వస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ఏ అధికారంతో తోసిపుచ్చారని డిప్యూటీ స్పీకర్‌ను ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం నిలదీసింది. జాతీయ అసెంబ్లీని రద్దు చెల్లదని పేర్కొంటూ, తక్షణమే పునరుద్ధరించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈనెల 9న ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటారు. అందులో మెజారిటీ నిరూపించుకోలేకపోతే, ఆ వెంటనే కొత్త ప్రధాని ఎంపికపై కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే విపక్షాలన్నీ సిద్ధంగా ఉన్నందున, అదే రోజు కొత్త ప్రధాని ఎంపిక ప్రక్రియ పూర్తయినా ఆశ్చర్యం లేదు. ఇలావుంటే, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికంటే ముందుగానే ఇమ్రాన్ తన పదవికి రాజీనామా చేస్తారన్న వాదన వినిపిస్తున్నది. కానీ, కడపటి వార్తలు అందే వరకూ ఇమ్రాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.