HomeNewsBreaking Newsపార్లమెంటులో ప్రతిపక్ష భాషపై అణచివేత ఆంక్షలు!

పార్లమెంటులో ప్రతిపక్ష భాషపై అణచివేత ఆంక్షలు!

మోడీ రక్షణార్థమే నిషిద్ధ జాబితాలో మరికొన్ని పదాలు
కొత్త బుక్‌లెట్‌ విడుదల చేసిన లోక్‌సభ సెక్రటేరియట్‌
పార్లమెంటులోనే తేల్చుకుంటాం: కాంగ్రెస్‌
న్యూఢిల్లీ:
పార్లమెంటులో చట్టసభ సభ్యులు గౌరవపూర్వకమైన భాషలో మాట్లాడేందుకు వీలుగా వాడుక నుండి తొలగించిన అసభ్యకరమైన, కించపరచే నిషిద్ధ పదాల జాబితాలో సర్వసాధారణంగా వాడే మామూలు మాటలు, పదాలను కూడా కొత్తగా చేర్చారు. గడచిన ఎనిమిది సంవత్సరాగా తనదైన పద్దతిలో సరికొత్త మెజారిటీ మత పరిపాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రతిపక్షాల సభ్యులు నిబంధనలను ఉల్లంఘించకుండా మర్యాదకు భంగం కలగని భిన్నమైన పదాలు ఉపయోగిస్తూ మోడీపై విరుచుకుపడుతూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఉపయోగిస్తున్న ఈ పదాలు జనాల్లోకి వెళ్ళిపోతూ మోడీ ప్రతిష్టకుభంగం కలిగిస్తూ ఉండటంతో ఈ పదాలను పార్లమెంటులో ఉపయోగించకూడదని, వాటిని “అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌” జాబితాలో చేర్చామని ప్రకటించడంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. మోడీ చెప్పిందే శాసనంగా చెలామణీ అవ్వాలా అని విమర్శిస్తున్నాయి. మోడీకి వ్యతిరేకంగా వాడే పదజాలాన్ని పార్లమెంటులో ఉపయోగించడానికి వీలులేని నిషిద్ధ జాబితాలో చేర్చడాన్ని కాంగ్రెస్‌పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన పార్టీలు నిశితంగా విమర్శించాయి. ఈ “అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌” (పార్లమెంటులో నిషిద్ధ పదాల జాబితా) కు సంబంధించి కొత్త బుక్‌లెట్‌ను లోక్‌సభ సెక్రటేరియల్‌ విడుదల చేసింది. ఈ బుక్‌లెట్‌ ప్రకారం, ‘జుమ్లాజీవి’,‘బాల్‌ బుద్ధి’, కొవిడ్‌ స్ప్రెడర్‌’, ‘స్నూప్‌ గేట్‌’ అనే పదాలతోపాటు సర్వసాధారణంగా ఉపయోగించే ‘ఎషేమ్‌డ్‌’,‘ఎబ్యూజ్డ్‌’, బిట్రేయడ్‌’, ‘కరప్ట్‌’, ‘డ్రామా’,‘హిపోక్రసీ’, ‘ఇన్‌కాంపిటెంట్‌’ వంటి పదాలను కూడా ‘అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌’లో చేర్చారు.
నవ భారతానికి నవ నిఘంటువు : రాహుల్‌గాంధీ విమర్శ
‘అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌’ జాబితాలో సర్వసాధారణమైన సుతిమెత్తని విమర్శలకోసం ఉపయోగించే పదాలను కూడా చేర్చడాన్ని కాంగ్రెస్‌పార్టీ పూర్వాధ్యక్షుడు, లోక్‌సభ ఎంపి రాహుల్‌గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. మోడీ ప్రభుత్వం తమ సౌలభ్యంకోసం తీసుకున్న ఈ చర్యలను నిశితంగా విమర్శిస్తూ, లోక్‌సభ సెక్రటటేరియల్‌ విడుదల చేసిన కొత్త బుక్‌లెట్‌ను ‘నవ భారతదేశం కోసం బిజెపి రచించిన ఒక సరికొత్త నిఘంటువు’గా అభివర్ణించారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో పోస్టింగ్‌చేస్తూ, “అన్‌పార్లమెంటరీ” అనే పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్లమెంటులో చర్చల సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతన్న తీరుతెన్నులను విమర్శించడానికి సరైన అర్థాలు స్ఫురించేవిధంగా ఉపయోగించే పదజాలాన్ని ఇక మీదట మాట్లాడకుండా చేశారని విమర్శించారు.అబద్ధాలు చెప్పేటప్పుడు ఆయన మొసలి కన్నీళ్ళు కార్చే జుమ్లాజీవి తానాషా అని,ఆయన అసమర్థత రుజువైందని విమర్శించారు. ఈ కొత్త బుక్‌లెడ్‌ విడుదల ఘనకార్యాన్ని కాంగ్రెస్‌ జాతీయ ప్రధానకార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ కూడాతీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షాలు ఉపయోగించే పదజాలం అంతా మోడీ నిజస్వరూపాన్ని బహిర్గతం చేసేదేననీ, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ పదజాలాన్ని ‘అన్‌పార్లమెంటరీ’గా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. మరి ఇక ఆ తర్వాత ఏం చేస్తారు విష్‌గురు అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ట్వీట్‌చేస్తూ, అసలు ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటీ? అని నిలదీశారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారు అవినీతికి పాల్పడ్డారని చెప్పకూడదా? అవినీతిపరుడని పిలిస్తే పరువు తక్కువ అనిపిస్తోందా అని విమర్శించారు. రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పినమోడీ రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని మరిన్ని అబద్ధాలు చెపారని, మరి అలాంటప్పుడు జుమ్లా అనకుండా వారికి కృతజ్ఞతలు చెప్పాలా అని ప్రశ్నించారు. “ఈ దేశంలో అన్నదాతలను పార్లమెంటులో ఎవరు ‘ఆందోళనజీవి’ అని అభివర్ణించారు?” గుర్తు తెచ్చుకోవాలని ప్రియాంకాగాంధీ డిమాండ్‌ చేశారు.
పార్లమెంటులో తేల్చుకుంటాం
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జునఖర్గే ట్విట్టర్‌లో పోస్టింగ్‌ చేస్తూ, జుమ్లాజీవి, కరప్ట్‌, డ్రామా, హిపోక్రసీ లాంటి పదాలను ఈ ప్రభుత్వం నిషేధిస్తే నిషేధించి ఉండవచ్చు కానీ, ఈ ప్రభుత్వం భారతదేశంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది, దేశంలో పెరుగుతున్న వంటగ్యాస్‌ ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, అగ్నిపథ్‌ పథకం వంటి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని మల్లికార్జునఖర్గే డిమాండ్‌ చేశారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తేల్చుకుంటామని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పదాలన్నీ వాడతా
సస్పెండ్‌ చేస్తారా? చెయ్యండి
తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకుడు డెరెక్‌ ఓ బ్రెయిన్‌ ఈ బుక్‌లెట్‌ను విమర్శిస్తూ, కొద్ది రోజుల్లో పార్లమెంటుసమావేశాలు ప్రారంభం అవుతాయని, పార్లమెంటు వేదికపైనే ఈ విషయం తేల్చుకుంటామని అన్నారు. “వారు నిషేధించిన పదాలన్నీ సభలో వాడతా, నన్ను సస్పెండ్‌చేస్తారా? చెయ్యండి” అని డెరెక్‌ ఓ బ్రెయిన్‌ సవాలు చేశారు. సమావేశాలకు ముందుగానే ఎంపీలపై “గ్యాగ్‌ ఆర్డర్స్‌” (భాషను అణచివేసే ఉత్తర్వులు) ఇచ్చారని అన్నారు. “ఇప్పుడు మేం సాధారణంగా ఉపయోగించే పదాలను కూడా పార్లమెంటులో ఉపయోగించడానికి వీలులేదు, ఎషేమ్‌డ్‌, ఎబ్యూజ్‌, బిట్రేయడ్‌, కరప్ట్‌, హిపోక్రసీ, ఇన్‌కాంపిటెంట్‌ వంటి పదాలు కూడా వాడకుండా చేశారని ట్విట్టర్‌లో విమర్శించారు. పార్లమెంటులో తాను పోరాటం చేస్తానన్నారు. శివసేన నాయకురాలు ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ, “వాహ్‌! మోడీజీ! వాహ్‌! సత్యాలను తలకిందులు చేస్తున్నారుగా” అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. “ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి వాహ్‌ మోడీజీ అని మాత్రమే అనాలి అని విమర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments