రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ప్రజాపక్షం/హైదరాబాద్: పాత సచివాలయాన్ని ఈనెల 28 నుంచి మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాత సచివాలయ ప్రాంగణం నుంచి ఖాళీ చేసి తమకు కేటాయించిన భవనాలకు వెంటనే వెళ్ళి పోవాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) అధికారులు అన్ని శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీనితో సచివాలయ భవనాల నుంచి శాఖల తరలింపును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే 90 శాతం మేరకు పాత సచివాలయం బ్లాకులు భవనాలు ఖాళీ కాగా తాజాగా జిఎడి అధికారులు తీసుకున్న నిర్ణయంతో నెల 29వ తేదీలోగా పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి. జిఎఎడి అధికారులు బృందాలుగా ఏర్పడి సచివాలయం ఖాళీ చేసే పనులను పర్యవేక్షిస్తున్నారు. పాత సచివాలయంలోని అన్ని బ్లాకులను వారు తిరుగుతూ తరలింపుల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. బిఆర్‌కెఆర్ భవనానికి వెంటనే తరలిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం ఉదయం పాత సచివాలయ ప్రాంగణం ప్రధాన ద్వారానికి జిఎఎడి అధికారులు తాళం వేసి వాటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉంచనున్నట్లు సమాచారం. సోమవారం అనంతరం పాత సచివాలయానికి వెళ్లే అవసరం ఉన్న శాఖల అధికారులు లేదా సిబ్బంది తాళాలను సిఎస్ దగ్గరి నుంచే తీసుకోవాల్సి ఉంటుందని జిఎడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలను కూల్చివేసి రూ.400 కోట్లతో కొత్తగా సచివాలయ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో గత రెండు నెలలుగా పాత సచివాలయంలోని వివిధ శాఖలను అక్కడి నుంచి హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాలలో గల సంబంధిత శాఖల భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాలలోకి తరలిస్తున్నారు. కాగా పలు శాఖలకు తగిన భవనాలు అందుబాటులో లేకపోవడంతో వాటి తరలింపు జాప్యం జరిగిందని, ప్రస్తుతం వాటికి కూడా భవనాలు కేటాయించడంతో తరలింపు ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని అధికారులు చెప్పారు.