అక్రమంగా పాస్‌పోర్టులు, ఆధార్‌కార్డులు పొందిన వారిపై నిఘా
హైదరాబాద్ : మయన్మార్ నుంచి వలస వచ్చి పాతబస్తీలో తలదాచుకుంటున్న రోహింగ్యాలపై పోలీసులు దృష్టి సారించారు. వీరికి సహకరిస్తున్న హైదరాబాదీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వారు అక్రమంగా ఆధార్‌కార్డులు, పాస్‌పోర్టులు, రేషన్‌కార్డులు తదితర ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకున్నారు. ఇవన్ని కూడా స్థానికుల సహకారంతోనే తీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వీరికి సహకరిస్తున్న వారి వివరాలను సేకరించి ఇటీవలే ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయినా రోహింగ్యాలకు మరికొంత మంది పాతబస్తీ వాసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారు. కొన్ని స్కూల్ యాజమాన్యాలు కూడా వారికి సహరిస్తూ తప్పుడు బోనాఫైడ్లు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని చాంద్రాయగుట్ట, పహాడీషరీఫ్, శంషాబాద్, బార్కాస్ తదితర ప్రాంతాలలో రోహింగ్యాలు నివసిస్తున్నారు. శరణానార్ధులుగా వచ్చిన వారికి నివస, భోజన సదుపాయం కల్పించడంలో సహాయ సహకారాలు చేయడంలో తప్పు లేదు. మానవతాదృక్పదంతో వారికి నీడనివచ్చను కానీ వారికి అక్రమంగా ఆధార్‌కార్డులు, నివాసదృవీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు, పాస్‌పోర్టులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు దృవీకరణ పత్రాల ద్వారా వీరిలో కొందరు పాస్‌పోర్టులు తీసుకుని అరబ్ దేశాలకు సైతం వెళ్లినట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం ఉంది. గతంలో రోహింగ్యాలకు తప్పుడు మార్గంలో పాస్‌పోర్టులు తయారు చేసి ఇచ్చిన ముగ్గురు పాతబస్తీకి చెందిన ఏజెంట్లను అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. మయన్మార్ దేశం నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం సహజమే అయితే వారిలో ఎంత మంది నేర చరిత్ర కలిగి ఉన్నారో ఇంత వరకు తెలియదు. యమన్మార్‌లో నేరాలు చేసి వచ్చిన వారు కూడా శరణార్థుల ముసుగులో ఇక్కడ తలదాచుకుంటున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. రోహింగ్యాలకు పాస్‌పోర్టు తయారు చేసి ఇవ్వడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల హస్తం కూడా ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయి. అందుకే సదరు అధికారిని అక్కడి విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. పాతబస్తీకి చెందిన కొందరు వ్యక్తులు డబ్బులకు కక్కూర్తిపడి రోహింగ్యాలకు అక్రమంగా ఆయా దృవీకరణ పత్రాలు తయారు చేసి ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల రోహింగ్యాలు హైదరాబాది నివాసులుగా గుర్తింపు పొందడం, ఆ తరువాత స్వదేశీయులనే ముద్ర పడాలనే ఉద్దేశ్యంతోనే వారు ఆయా దృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారని పోలీసులు అంటున్నారు.అయితే వాట ఆటలు సాగనీయకుండా రోహింగ్యాలపై పోలీసుల నిఘా పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఐదు వేల మంది రోహింగ్యాల కుటుంబాలు శరణార్థులుగా వచ్చాయని పోలీసుల అంచనా. ఈ అందరి కుటుంబాలపై నిఘా పెట్టారు. వారి వివరాలను ప్రత్యేకంగా సేకరించే పనిలో పడ్డారు. వారి వేలి ముద్రలు, పేర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, వారి పిల్లల వివరాలు, ఏఏ వ్యాపారాలు, కూలీపనులు, చేస్తున్నారనే విషయాలపై ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు. అన్ని వివరాలు సేకరించి రోహింగ్యాలకు సంబంధించి ప్రత్యేక రికార్డు తయారు చేసి పెట్టుకున్నట్లయితే భవిష్యత్తులో వారి కదలికలపై నిఘా పెట్టేందుకు వీలు కలుగుతుందని పోలీసులు అంటున్నారు. కొందరు రోహింగ్యాలు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలలో లబ్దిదారులుగా చేరారు. ఇందుకు సహకరించిన వారి వివరాలు త్వరలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. రోహింగ్యాలు ఇక్కడి బ్యాంక్ ఖాతాదారులుగా కూడా చేరారు. వారి ఖాతాల వివరాలను సైతం పోలీసులు సేకరిస్తున్నారు. వీరి ఖాతాలలోకి ఎవరైనా విదేశాల నుంచ నిధులు సమకూరుస్తున్నారా, వీరికి ఆయా ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు కలిగి ఉన్నాయా అనే కోణంలా దృష్టి సారించారు.గతంలో బాలాపూర్ క్రిసెంట్ స్కూల్ యాజమాన్యం రోహింగ్యాలకు తప్పుడు బోనాఫైడ్‌లు ఇచ్చి వారికి సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రోహింగ్యాలకు భారత పౌరసత్వం పొందే ధృవపత్రాలు కూడా తయారు చేసిన ఏజెంట్లను పోలీసులు గుర్తించారు. రోహింగ్యాలు నివసిస్తున్న ప్రాంతాలలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించే సమయంలో ఆధార్‌కార్డులను పరిశీలిస్తున్నారు. దీన్ని ఓ రాజకీయపార్టీ జీర్ణించుకోవడం లేదు. అసలు ఆధార్ కార్డు అడిగే హక్కు పోలీసులకు లేనేలేదని బహిరంగంగా ప్రకటనలు చేశారు. ఈ లెక్కన రోహింగ్యాలకు సదరు పార్టీ నేతలు పరోక్షంగా సహకరిస్తున్నారని తెలుస్తుంది. ఆధార్‌కార్డులను సైతం తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి తాయరు చేశారని తేలండంతో 127 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై తగిన ఆధారాలను రోహింగ్యాలు చూపించాల్సి ఉంది. ఒకవేళ్ల సరైన దృవీకరణ పత్రాలు చూపించని పక్షంలో 127 మందిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. దీనిపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాతబస్తీలో రోహింగ్యాలపై పోలీసుల ఆరా
RELATED ARTICLES