పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అమ్మవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు
ప్రజాపక్షం/హైదరాబాద్ హైదరాబాద్ జంటనగరాలతో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా భయంతో తెల్లవారు జాము నుంచే మహిళలు అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. సాయంత్రం వరకు దేవాలయల్లో సందడి నెలకొంది. పాతబస్తీ ప్రాంతంలో బోనాల పండుగ కోలాహలం కనిపించింది. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా లాల్‌దర్వాజలోని సింహవాహని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు బోనాలు తీసుకుని తండోపతండాలుగా వచ్చారు. రాజకీయ ప్రముఖులు కూడా బోనాలు సమర్పించేందుకు తరలిరావడంతో కోలాహలం మిన్నంటింది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల శిగాలతో దేవాలయాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. ట్యాంక్‌బండ్ కనకల కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దేవాలయం వద్ద భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బోనాలు తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. బోనాల సందర్భంగా 8 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాలయాల పరిసర ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి మాస్కులు ధరించాలని ప్లెక్సిలు, బోర్డులు ఏర్పాటు చేసింది. మాస్కులు ధరించాలని దేవాలయాల కమిటీ సభ్యులు, నిర్వహకులు భక్తులకు సూచించారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ బోనాలను నిర్వహిస్తున్నామన్నారు. బోనాలకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సిఎం కెసిఆర్ బోనాల ఉత్సవాలకు నిధులు కేటాయిస్తున్నారని, బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సంవృద్ధిగా పండుతున్నాయని తెలిపారు. అంతకుముందు మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారిని శాలిబండలోని అక్కన్న మాదన్న, అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి, అంబర్ పేట్ మహంకాళి అమ్మవార్లను దర్శించుకుని, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అమ్మవారిని దర్శించుకున్నారు. అదే విధంగా సింహవాహిని అమ్మవారని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నగరంలోని పలు దేవాలయాల్లో రాజకీయ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డి.కె.అరుణ, పార్టీ నేతలతో కలిసి విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు.
పాతబస్తీలో బోనాల జోష్
RELATED ARTICLES