శత్రు దేశం పాకిస్థాన్ గడ్డపై ఎట్టకేలకు భారత మువ్వెన్నల పతాకం రెపరెపలాడింది. కరాచీ స్టేడియం వేదికగా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఘనంగా ప్రారంభమైంది. ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ సందర్భంగా కరాచీ స్టేడియం పైకప్పుపై ఈ టోర్నీలో బరిలోకి దిగిన 8 దేశాల జెండాలను ఎగరవేసారు. అయితే రెండు రోజుల క్రితం జెండా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కరాచీ, లాహోర్ మైదానాల్లో భారత్ జెండాను పీసీబీ ఎగరవేయలేదు. మిగతా ఏడు జట్ల జెండాలను ఎగరవేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పీసీబీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ తన నీచ బుద్దిని బయటపెట్టుకుందని మండిపడ్డారు. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించకపోవడంతోనే పిసిబి జెండాను ఎగరవేయలేదని ఆ దేశ నెటిజన్లు, జర్నలిస్ట్‌లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పిసిబి కూడా స్పందించింది. ‘ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్‌కు భారత్ రావట్లేదు. కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతున్న జట్ల జెండాలను మాత్రమే ఎగరవేశాం. భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. బంగ్లాదేశ్ కూడా ఇంకా పాకిస్థాన్‌కు రాలేదు. ఆ జట్టు తమ తొలి మ్యాచ్‌ను భారత్‌తో ఆడనుంది. కాబట్టి భారత్, బంగ్లాదేశ్ జెండాలను ఇంకా ఎగరవేయలేదు. పాకిస్థాన్‌కు వచ్చిన మిగతా జట్ల జాతీయ పతకాలను మాత్రమే ఎగరవేసాం. ఈ జెండాల గురించి పీసీబీ అధికారికంగా స్పందించాల్సిన అవసరం లేదు.’అని ఆ బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి.
ఎట్టకేలకు ఎగిరిన భారత జెండా..
ఈ వ్యవహారంపై బిసిసిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. టోర్నీలో భాగమయ్యే అన్ని దేశాల జెండాలను ఎగరవేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బిసిసిఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా భారత జెండా ఎగరవేయాలని పేర్కొన్నారు. ఇక తొలి మ్యాచ్ సందర్భంగా భారత జెండాను ఎగరవేసి ఈ వివాదానికి పిసిబి ముగింపు పలికింది. ప్రస్తుతం కరాచీ స్టేడియం ఎగురుతున్న భారత జెండా వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపిస్తూ పాకిస్థాన్‌లో పర్యటించేందుకు బిసిసిఐ అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేలా బిసిబిని ఐసిసి ఒప్పించింది. ఇందుకుగానూ బిసిసిఐ- పిసిబిల మధ్య ఓ ఒప్పందం జరిగింది. భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ తమ మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహించాలని పిసిబి కోరగా.. అందుకు బీసీసీఐ అంగీకరించింది.
పాక్ గడ్డపై ఎగిరిన భారత జెండా!
RELATED ARTICLES