వేములవాడలో రోడ్డు ప్రమాదం
ముగ్గురు విద్యార్థులు మృతి
పాఠశాల అనుమతి రద్దు చేయాలని డిమాండ్
చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల హామీ
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. గాయపడిన వారిని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వాగేశ్వరి టాలెంట్ స్కూలుకు చెందిన మినీ బస్సు తిప్పాపూర్లోని ఆర్టిసి డిపో సమీపంలో అతివేగంగా ప్రయాణిస్తూ డివైడర్ను ఢీకొంది. రుద్రంగి మం డలం మానాలకు చెందిన గుగులోతు దీక్షిత (7), వట్టెంలకు చెందిన కాసారపు మణిచందనరాణి (15) అక్కడికక్కడే మృతి చెందారు. మానాలకు చెందిన రిషిత్ (6)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. గాయపడిన వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. విగతజీవుల్లా పడి ఉన్న తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.ఈ ఘటనకు కారణమై న అధికారులను సస్పెండ్ చేయాలని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, స్థానికులు ఆర్టీసి బస్సు డిపో ఎదుట బైఠాయించారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి ఈటల రాజేందర్
స్కూల్ బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను,తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరు ను జిల్లా ఎస్పి రాహుల్హెగ్డేను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పసి ప్రాణాలను మింగిన స్కూల్ బస్
RELATED ARTICLES