ప్రజాపక్షం/ అశ్వారావుపేట రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ మొక్కల పెంపకం అపహాస్యంగా మారుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీలోని బస్టాండ్ ఆవరణలో చెత్తకుప్పపై ‘ఎండిపోయిన పల్లె ప్రగతి మొక్కలు’ దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనం. అధికారులు, పాలకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పారదర్శకత కరువైంది. మండలానికి పల్లె ప్రగతిలో భాగంగా హరితహారం మొక్కల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం స్పెషల్ అధికారులను సైతం ప్రత్యేకంగా నియమించినప్పటికీ మొక్కల పెంపకంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని చెత్తకుప్పపై మొక్కలు కనబడిన ఘటనలు రుజువు చేస్తున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు. అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, పాలక సభ్యులు, ఉపసర్పంచ్ మధ్య చోటుచేసుకున్న విభేదాలే వీటన్నింటికి కారణమవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో అధికారులు సైతం పూర్తిగా విఫలం అవుతున్నారని కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో మొక్కల పెంపకానికి తగినన్ని నిధులు ఇస్తూ ప్రోత్సాహంగా వ్యవహరిస్తుందని, మొక్కలను నిర్ధిష్టమైన పద్ధతిలో పెంచేందుకు కార్యాచరణ రూపొందించి సర్క్యులర్ రూపంలో ఇచ్చినప్పటికీ ప్రతి మొక్కనూ ప్రతిఒక్కరూ బాధ్యతగా పెంచాలని ఆదేశించినా అధికారులు, పాలకులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. సాదాసీదాగా పనులు చేసి సొమ్ములు చేసుకుందామనుకునే ఉత్సాహం మొక్కల పెంపకంలో మాత్రం కరువైందని పలు గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు.
పల్లె ప్రగతి అపహాస్యం
RELATED ARTICLES