వ్యవసాయ శాఖ విధానాలు దేశానికి ఆదర్శం
త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల పనులు
పారదర్శకతకు కొత్త రెవెన్యూ చట్టం
71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్
ప్రజాపక్షం / హైదరాబాద్: పల్లె ప్రగతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ప్రభుత్వం ఈ దిశగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. తండాలు, గిరిజన గూడేలను పంచాయతీలుగా మార్చిందన్నారు. పంచాయతీరాజ్ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన అగాధం నుంచి తెలంగాణ వేగంగా కోలుకుంటున్నదన్నారు. అతి స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి, నేడు దేశానికే తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో గడిచిన ఆరేళ్లలో బలమైన పునాదులు నిర్మించుకుందన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎంతో సానుకూల దృక్పథంతో, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నదన్నారు. దేశ 71వ గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని సెంట్రల్ లాన్స్‌లో జరిగిన గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్‌సిలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసి గణతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఓ రాష్ట్ర గవర్నర్‌గా తొలిసారి గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడం తనకు జీవితాంతం గుర్తుండే గొప్ప అనుభూతి అని, ప్రేమాభిమానాలకు మారుపేరైన తెలంగాణ ప్రజలతో ఈ అపూర్వ సందర్భాన్ని పంచుకోవడం గర్వకారణంగా భావిస్తున్నానన్నారు. ‘స్వరాష్ట్రంలో సుపరిపాలన’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. 23 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా 33 జిల్లాల తెలంగాణ చేసుకున్నామని, రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 69కి పెంచుకున్నామన్నారు. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, మారుమూల పల్లెలను పత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించడం ద్వారా తెలంగాణలో గ్రామ పంచాయతీల సంఖ్య 8,690 నుంచి 12,751కి చేరిందన్నారు. జిల్లాలు, మండలాల సంఖ్య పెంచుకోవడం ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువైందన్నారు.
‘పల్లె ప్రగతి’తో మార్పు కనిపిస్తున్నది
తెలంగాణ పల్లెలను దేశంలోకెల్లా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు పోతున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లెలను బాగు చేసుకునే ఒరవడి అలవాటు కావడం కోసం ఇప్పటికే రెండు విడతలుగా ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం అమలైందని, ఏ ఊరి ప్రజలు ఆ ఊరికి కథా నాయకులు కావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపును ప్రజలు అందుకున్నారని గవర్నర్ తెలిపారు. చేయి చేయి కలిపి శ్రమదానం చేసి, సమిష్టి కృషితో ఎవరి గ్రామాన్ని వారు అద్దంలా తీర్చిదిద్దుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేసుకున్నారు. స్మశాన వాటికల నిర్మాణానికి, డంపు యార్డుల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసుకున్నారు. గ్రామాల్లో పవర్ వీక్ నిర్వహించుకుని, వంగిన కరెంటు పోళ్లను, వేలాడే కరెంటు వైర్లను సరిచేసుకున్నారు. అవసరాలు-వనరుల ప్రాతిపదికగా వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకున్నారు. దాని ప్రకారమే నిధులు ఖర్చు పెట్టే సంప్రదాయం ప్రారంభమయింది. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం అమలుకు ముందు, తర్వాత గ్రామాల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నది. మన ఊరిని మనమే బాగు చేసుకోవాలనే చైతన్యం పొందింనందుకు తెలంగాణ ప్రజలను మనసారా అభినందిస్తున్నాను. ఇదే స్పూర్తిని మున్ముందు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఇక రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్నదన్నారు. సగం మంది జనాభా పట్టణాల్లోనే జీవిస్తున్న కారణంగా పట్టణాల రూపురేఖలు మారాల్సిన అవసరం ఉందన్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదన్నారు.