స్థానికంలో ‘ఆమె’కు మాత్రమే రిజర్వేషన్లు
సగానికి పైగా స్థానాల్లో మహిళలకే అధికారం
ప్రజాపక్షం/హైదరాబాద్: గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి రాష్ట్రం లో పల్లె పాలనపై పడతుల ఆధిపత్యం మొదలయింది. ఇన్నాళ్లు ఆకాశంలో సగం అని, జనాభాలోనూ వారే ఎక్కువ అని, వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, చట్ట సభల్లోనూ ఇదే రీతిలో ప్రాతినిధ్యం ఇస్తామని చెబుతూ వచ్చారే తప్ప దీనిని పాలకులు ఇప్పటి వరకు అమలు చేయలే దు. ఇప్పటికి అసెంబ్లీ, లోక్‌సభ వంటి చట్ట సభ ల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవు. రాష్ట్రంలో ఇప్ప టివరకు జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ మహిళలకు 33శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండేది. ఈసారి కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రావడంతో ఒక్కసారిగా పల్లెల్లో అధికార పగ్గాల రూపురేఖలు మారిపపోయాయి. గ్రామ పంచాయ తీ, మండల, జిల్లా పరిషత్‌లలో ఎస్సి, ఎస్టి, బిసి ఇలా క్యాటగిరీల వారీగా రిజర్వేషన్లు కేటాయించినప్పటికి ఆయా క్యాటగిరీల్లో 50శాతం మహిళలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించారు. మిగిలిన 50శాతం స్థానాలు పురుషులకు మాత్రమే కాదు, వాటిల్లో కూడా మహిళలు పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో వారికే కేటాయించిన 50 శాతం స్థానాలతో పాటు ఆయా క్యాటగిరీల్లో మిగిలిన 50శాతం స్థానాల్లోనూ కొన్ని చోట్ల మహిళలు పోటీ పడుతున్నారు. దీంతో 50శాతం స్థానాలకోసమే ఇన్నాళ్లు పోరాడిన మహిళలు ఈ సారి ఏకంగా 50శాతానికి పైగా స్థానాల్లో అధికారం దక్కించుకున్నా రు, త్వరలో జరగబోయే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లోనూ సగానికి పైగా వారే పదవుల్లోకి రానున్నారు. దీంతో దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల పాలన సింహభాగం మహిళల చేతుల్లో ఉండబోతోంది.