ముఖ్యమంత్రి దిశానిర్దేశం
రిటైర్మెంట్ వయసు పెంచుతా
పదోన్నతులు కల్పిస్తా.. ఫికర్ వద్దు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల పదోన్నతుల జాబితాను రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని, పదోన్నతుల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలని సిఎం అన్నారు. ఉద్యోగులు కూడా పదోన్నతుల విషయంలో వేసుకున్న కేసులను ఉపసంహరించుకోవాలని, అందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను కూడా సృష్టిస్తామని సిఎం వెల్లడించారు. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంలో దూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సిఎం వెల్లడించారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలుపుతూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సిఎం ఆదేశించారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర సదస్సులో సిఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె.జోషితో పాటు సీనియర్ అధికారులు, టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్ట ర్ కె. కేశవరావు ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, జిల్లాల కలెక్టర్లు, డిపిఒలు, డిఎఫ్‌ఒలు, సిఇఒలు, డిఎల్‌పిఒలు, ఎంపిడివోలు, డిస్కమ్‌ల సి ఎండిలు జి.రఘుమారెడ్డి, గోపాలరావుతో పా టు ఎస్‌ఇలు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రా్రష్ట్రాలు వచ్చి నేర్చుకునే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతోచేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృ త ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సిఎం కెసిఆర్ అన్నారు. ముప్పు రోజుల తర్వాత ఖచ్చితంగా గ్రామ ముఖ చిత్రం మారితీరాలని, దసరా పండుగను ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలని సిఎం తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. గ్రామా ల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నం లో భాగంగా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కావాల్సిన అధికారాలు, విధులు, నిధులను ప్రభుత్వం అం దించిందని సిఎం అన్నారు. గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు కూడా అధికారాలు, బాధ్యతలు అప్పగించాలని ప్రభు త్వం నిర్ణయించిందని సిఎం వెల్లడించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని, నియంత్రిత పద్ధతిలో విస్తృ త ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలని సిఎం నిర్దేశించారు. పల్లెల ప్రగతికి మంచి మార్గం వేయడానికి అమలు చేసే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసే బాధ్యత ప్రజల మీదే ఉందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై, ఏ ఊరి ప్రజలే ఆ ఊరి కథానాయకులై తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని, అవసరమైన చోట ప్రజలే శ్రమదానం చేయాలన్నారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పని చేసి, తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు సిఎం చెప్పారు. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం, నిధుల సద్వినియోగం,ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ది పను లు నిర్వహించడం అనేది నిరంతరం సాగాలని, దీనికో సం ఈ 30 రోజుల ప్రణాళికతో మంచి ఒరవడి ప్రారం భం కావాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని సిఎం అన్నారు. కలెక్టర్లు నాయకత్వం వహించాలని, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిబద్ధతతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ బాధ్యతలు పంచుకునేందుకు ముఖ్య శాఖలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, డిప్యూటీ కలెక్టర్ లేదా మరో హాదా కల్పిస్తామని, వారిలో ఒకరిని పంచాయతీ రాజ్ శాఖకు కేటాయిస్తామని వెల్లడించారు. ప్రతీ గ్రామానికి ఒక మండల స్థాయి అధికారి పర్యవేక్షకుడిగా నియమించాలని, జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో మండల పంచాయతీ అధికారి, గ్రామ స్థాయి లో ప్రత్యేక అధికారి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు. ప్రతీ ఇంటికీ, ప్రతీ ఆస్తికి సరైన విలువ కట్టాలని, క్రమం తప్పకుండా ఆస్తుల విలువ మదింపు చేయాలని, పన్నులు క్రమం తప్పకుండా వసూలు చేయాలని, పన్నులు వందశాతం వసూలు చేయని గ్రామ కార్యదర్శిపై చర్యలుంటాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 100 ఫ్లయింగ్ స్క్వాడ్ లు
సీనియర్ అధికారుల నేతృత్వంలో 100 ఫ్లయింగ్ స్వ్కాడ్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తర్వాత ఈ బృందాలు గ్రామా ల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయన్నారు. లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందుతాయని, అజాగ్రత్త, అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలుంటాయని సిఎం హెచ్చరించారు.
పల్లెల రూపు మారాలె
RELATED ARTICLES