ఎల్లో అలెర్ట్ జారీ చేసిన అధికారులు
ప్రజాపక్షం/హైదరాబాద్ /కాళేశ్వరం రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకా శం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తన్నాయి. రాష్ట్రంలో తూర్పు, ఈశన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైందని అధికారులు చెప్పారు.
సరస్వతీ బ్యారేజీ 36,లక్ష్మీ బ్యారేజీ 85 గేట్ల ఎత్తివేత
భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం సరస్వతి బ్యారేజికీ బుధవారం ఎగువ ప్రాంతంలోని మానేరు నుండి 30,463 క్యూసెక్కులు, గోదావరి ప్రాంతం నుండి 62,248 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో సరస్వతీ బ్యారేజీ 36 గేట్లను ఒక మీటరు మేర ఎత్తి 1,46,544 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల కొనసాగిస్తున్నారు. అదే విధంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకీ ఎగువలోని గోదావరి, ప్రాణహిత ఉభయ నదుల నుండి 3,07,590 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి కొనసాగుతుండటంతో గత జూలై మాసం నుండి తెరుచుకొని ఉన్న బ్యారేజీ 85 గేట్ల ద్వారా చేరుకున్న వరద నీటికి సమాన స్థాయిలో దిగువకు తరలిస్తున్నారు.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
RELATED ARTICLES