హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
ప్రజాపక్షం/హైదరాబాద్ ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 5:30 గంటలకు అప్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు రాజారావు తెలిపారు. అప్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రాష్ట్రం లో ఆదివారం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్- పట్టణం, వరంగల్-గ్రామీణం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందన్నారు. ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం అల్పపడీనం ఏర్పడిందన్నారు. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉందన్నారు. ఇది రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. రాగల రెండు, మూడు రోజుల్లో ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని రాజారావు పేర్కొంన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి
వర్ష పరిస్థితిపై సిఎస్‌తో సమీక్ష
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ల కలెక్టర్లు, ఎస్పిలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులను ఎప్పడికప్పుడు గమనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుం డా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పూర్వ అదిలాబాద్, కరీంనగర్ , నిజామాబాద్ , వరంగల్ , ఖమ్మం జిల్లాలలో భారీగా, అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో ఆదివారం సాయంత్రం పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సిఎం ఆదేశాల మేరకు సోమేష్‌కుమార్ జిల్లాల యంత్రాంగానికి తగిన ఆదేశాలు, సేచనలు జారీ చేశారు. వర్షాలు, వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదముందని, మరోవైపు చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్, పడిపోవడం వలన సాధారణ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడుతుందని, ఈ విషయాలలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు , చెరువులు, కుంటలు నిండి పొంగి పోవడం వల్ల లోతట్టు ప్రాంతాలలో, చిన్న బ్రిడ్జిలు , కాజివేలలో నీరు ప్రవహించవచ్చని, ట్రాఫిక్ అంతరాయలు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా యంత్రంగం మొత్తం అప్రమత్తంగా ఉంటూ ఇంతకు ముందే జారీ చేసిన ‘ఫ్లడ్ ప్రొటోకాల్’ తప్పని సరిగా అమలు చేయాలని సిఎస్ సోమేష్‌కుమార్ జిల్లా కలెక్టర్లను కొరారు. అవసరమైతే నాళాలు, వరద ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని పునారావాస కేంద్రాలకు తరలించాలని సిఎస్ అధికారులకు సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.