ప్రజాపక్షం/ హైదరాబాద్ : వరుసగా జరుగుతున్న ఘటనలను చూస్తుంటే రాష్ర్టంలో కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోతున్నదని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సరూర్ నగర్ హత్య ఘటన మరవక ముందే బేగం బజార్ లో జరిగిన హత్య తీవ్రంగా కలిచి వేసిందని శనివారం ఒక పత్రికా ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కుల,మతాంతర వివాహాలు చేసుకున్న వారికి సరైన రక్షణ కల్పించకపోవడం, మతోన్మాద, కులోన్మాద హత్యలకు పాల్పడుతున్న హంతకులను కఠినంగా శిక్షించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావతమవుతున్నాయని అన్నారు. బేగంబజార్లో నీరజ్, సంజన పెళ్లి చేసుకొని అదే కాలనీలో నివాసముంటున్న వారిపట్ల కక్ష పెంచుకున్న సంజన కుటుంబ సభ్యులు నీరజ్ ను అతిదారుణంగా చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారాల్లో పోలీసులు కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ఘటనలు పునరావతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వెంటనే దోషులను శిక్షించాలని, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించాలని చాడ డిమాండ్ చేశారు.
ప్రత్యేక చట్టం తీసుకురావాలి : ఇటి నరసింహ
పరువు హత్య అనే దురాఘాతాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇటి నరసింహ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో పరువు హత్యల పరంపర రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. కులాంతర వివాహం చేసుకున్న నీరజ్ కుమార్ పన్వర్ పరువు హత్యను సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ.టి.నరసింహ తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రజలకు జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ కల్పిస్తుందన్నారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని జరుగుతున్న ఈ హత్యలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. మతాంతర, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలపైన ఉందన్నారు. మతాంతర, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే వారు ఇరువురి తల్లితండ్రులను పిలిచి, కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నార అన్నారు. దీనితో చట్టం భయం లేకుండా పరువు హత్యలకు పాల్పడుతున్నారని, పరువు హత్యలను ప్రభుత్వాలు ఘోరమైన నేరంగా పరిగణించాల్సిన తక్షణ అవసరముందన్నారు. పరువు హత్యలకు పాల్పడే నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఐపిసి, సిఆర్‌పిసి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లను సవరించాలన్నారు. పరువు హత్యల నిందితులకు బెయిల్ రాకుండా చేసి, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. వీలైనంత త్వరగా కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వాలు చూడాలన్నారు. మృతుని భార్య సంజనను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ.టి.నరసింహ విజ్ఞప్తి చేశారు.