సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూటి ప్రశ్న
పిటిషన్‌ను వేరే అంశాలతో ముడిపెట్టరాదని హితవు
న్యూఢిల్లీ: హిజాబ్‌కు, పరీక్షలకు సంబంధం ఏమిటని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ పిటిషనర్లను సూటిగా ప్రశ్నించారు. దీనిని ఇతర అంశాలతో ముడిపెట్టరాదని హితవు పలికారు. పరీక్షలు దగ్గరపడుతున్నాయని, కాబట్టి హిజాబ్‌పై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లకుండా నిలుపుదల చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అంతకు ముందు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రధారణ కూడదని కర్నాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌ను అక్కడి హైకోర్టు విచారించింది. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం హిజాబ్ తప్పనిసరి కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించి రావడానికి వీల్లేదని కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ తీర్పుపై కొంత మంది పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా ఈ కేసును విచారణకు స్వీకరించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీం కోర్టు ఇది వరకు ఒకసారి తిరస్కరించింది. ఇది హడావుడిగా విచారణ చేపట్టాల్సిన అంశం కాదని వ్యాఖ్యానిస్తూ, హోలీ సెలవుల తర్వాత పరిశీలిస్తామని పేర్కొంది. గురువారం మరోసారి పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ విచారణను కోరుతూ సుప్రీం కోర్టులో వాదన వినిపించారు. వచ్చే వారం నుంచి పరీక్షలు ఉన్నాయని, హిజాబ్ ధరించి వెళితే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోకి రానివ్వడం లేదని తెలిపారు. పరీక్షలకు హాజరుకానివ్వకపోతే, ఒక విద్యా సంవత్సరం నష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాదనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ స్పందిస్తూ, హిజాబ్ వివాదానికి పరీక్షలకు సంబంధం లేదన్నారు. ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, వ్యాజ్యాన్ని ఎప్పుడు విచారణకు స్వీకరించేదీ ఆయన స్పష్టం చేయలేదు.
పరీక్షలకు.. హిజాబ్‌కు సంబంధం ఏమిటి?
RELATED ARTICLES