HomeNewsBreaking Newsపరిహారం... పరిహాసం

పరిహారం… పరిహాసం

భూసేకరణలో రైతులకు తీవ్ర అన్యాయం
చట్టాలను పట్టించుకోని అధికార యంత్రాంగం
ఆందోళనలు చేసినా దక్కని ఫలితం

ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ భూ సేకరణ జరిగిన అక్కడ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. పాలకులు ఎవరైనా సరే రైతులకు ఓ న్యాయం ఇతరులకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విలువైన భూములు కోల్పోయిన సమయంలోనూ అందుకు తగిన పరిహారం అందించడంలో ఎందుకో తీవ్ర వివక్ష జరుగుతుంది. భూమినే నమ్ముకుని ఆ భూమిపై ఆధారపడిన వారి పట్ల సానుకూలత ప్రదర్శించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలంగాణ వ్యాప్తంగా భూ ముల ధరలకు రెక్కలు వచ్చాయి. మారుమూల ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూములకు విపరీతంగా డిమాండ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో వివిధ ప్రాజెక్టులు, హైవేల కోసం భూ సేకరణ చేపట్టాల్సి వచ్చింది. సూర్యాపేట, దేవరపల్లి, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కింద ఒక ఖమ్మం జిల్లాలోనే సుమారు 1800 ఎకరాల భూమిని కోల్పోతున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఖమ్మం నగరం సహా వైరా, కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి మొదలైన ప్రధాన పట్టణాలకు అత్యంత సమీపం నుంచి వెళ్తుంది. మారుమూల గ్రామాల్లోనే ఎకరం రూ. 25 లక్షలు పైమాటే. ఇక పట్టణాలకు 10 కిలో మీటర్ల దూరంలో ఎక్కడ కోటి రూపాయలకు దిగువన వ్యవసాయ భూముల ధరలు లేవు. చింతకాని, ఖమ్మం అర్బన్‌, ఖమ్మం రూరల్‌ మండలాల్లో కొన్ని చోట్ల ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ ధరే రూ. 50 లక్షల పైమాటే. అటువంటి చోట కూడా వ్యవసాయ భూములకు రూ. 23 లక్షలు ఇస్తామనడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే సత్తుపల్లి, కల్లూరు ప్రాంతాలలో రూ. 25 లక్షల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించగా పాత ఖమ్మం తాలూకా పరిధిలోని మండలాలకు కోటి రూపాయల చొప్పున చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
కోటి రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించిన అధికారులు :
రెండేళ్ల క్రితం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో భూ సేకరణకు సంబంధించి ఎంజాయ్‌మెంట్‌ సర్వేను నిర్వహించారు. ఆ సందర్బంలో రైతులు ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేయకుండా అడ్డుకున్నారు. ఖమ్మం సమీపంలో ఇటీవల భూ సేకరణ జరిపిన రైతులకు ఇచ్చిన మాదిరిగా పరిహారం ఇవ్వాలని రైతులు పట్టుపట్టారు. ధంసలాపురం ప్లుఓవర్‌, కొత్త కలెక్టరేట్‌ భూ నిర్వాసితులకు ఇచ్చినవిధంగా పరిహారం ఇస్తామని అప్పుడు అధికారులు రైతులకు స్పష్టమైన హామీనిచ్చారు. ఆ హామీ మేరకే ఎంజాయ్‌మెంట్‌ సర్వే నిర్వహించారు. కానీ ఇప్పుడు ఒప్పందం మేరకు పరిహారం ఇచ్చేందుకు అధికారులు అంగీకరించడం లేదు. దీంతో రైతులు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే వివిధ రూపాలలో నిర్వాసిత రైతులు ఆందోళనలు చేపట్టారు. కోటి రూపాయలు చెల్లిస్తే తప్ప భూమిని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు.
ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది : గోవిందరావు
తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కొండపర్తి గోవిందరావు ఆరోపించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ విలువ లేదా రిజిస్ట్రేషన్‌ విలువకు మూడు రేట్లు అదనంగా రైతులకు చెల్లించాలని కానీ ప్రభుత్వం ఆ నిబంధనను అసలు పట్టించుకోవడం లేదన్నారు. కారుచౌకగా భూములను గుంజుకోవడానికి ప్రయత్నిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో పరిహారం పెంపుదల లేకుండా భూసేకరణకు వస్తే అడ్డుకుంటామని గోవిందరావు హెచ్చరించారు. అధికారులు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు పూనుకోవాలని కోరారు.
కోటి దక్కే వరకు ఆందోళన : వెంగళరావు
ఎకరాకు కోటి రూపాయల పరిహారం దక్కే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే భూ నిర్వాసితుల జేఏసి కన్వీనర్‌ దొబ్బల వెంగళరావు తెలిపారు. ప్రభుత్వ భూ విలువ ప్రకారం కోటిన్నర చెల్లించాలని ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం అయితే నాలుగు కోట్లు చెల్లించాలని కానీ రైతులు కోటి రూపాయలు మాత్రమే డిమాండ్‌ చేస్తున్నారని ఇది న్యాయమైన డిమాండ్‌ అని ఆయన తెలిపారు. ఖమ్మంకు 25 కిలో మీటర్ల మేర ఎకరం రెండు కోట్లు పైబడి ధర పలుకుతుందని కానీ రూ. 25 లక్షలకు భూములను గుంజుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇది సరైంది కాదన్నారు. కోటి రూపాయల పరిహారం దక్కకపోతే భూములను ఇవ్వబోమని వెంగళరావు తేల్చి చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments