సూర్యాపేట రోడ్డు విస్తరణకు రాజకీయ సెగలు
పరిహారం చెల్లింపుపై రగడ
అధికారుల పరస్పర విరుద్ధ ప్రకటనపై స్థిరాస్తిదారుల్లో ఆందోళన
ఆత్మహత్యలే శరణ్యమంటున్న వ్యాపారులు
సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో రోడ్ల విస్తరణలో నష్టపోయిన స్థిరాస్తిదారులకు పరిహారం అందించడంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పరిహాసమాడుతున్నారు. ప్రజాప్రతినిధులు సూర్యాపేట పట్టణంలో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపడుతామని ప్రకటించారు. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు స్థిరాస్తిదారులతో పలుమార్లు సమావేశమయ్యారు. రోడ్డు విస్తరణకు తాము వ్యతిరేకం కాదని, తమ దుకాణాలు కోల్పోవడం వలన ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతామని ఆవేదన వెలుబుచ్చగా, ఊహించని విధంగా అందరిని మెప్పించి, ఒప్పించి, పరిహారం అందించిన తదుపరే రోడ్డు విస్తరణ పనులు చేపడుతామని హామీలు ఇచ్చారు. రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారు పరిహారం విషయమై ప్రశ్నించగా ఆ ఊసే ఎత్తడంలేదు. ప్రజాప్రతినిధుల హామీలకు అధికారుల మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. పోలీసు బలగాల మోహరింపుతో భవనాల కూల్చివేత కార్యక్రమానికి సిద్ధమయ్యారు. తమకు నష్టపరిహారం చెల్లించకుంటే ఆత్మహత్యలు శరణ్యమని నిర్వాసితులు వాపోతున్నారు. అధికారులు మాత్రం భవనాల కూల్చివేతను నిలుపుదల చేసేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా అధికార పార్టీ నాయకులు మాత్రం రోడ్డు విస్తరణ జరగకుండా ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో రోడ్డు విస్తరణకు రాజకీయ రంగు పులుముకుంది. అధికారులు మాత్రం ఆదివారం (నేడు) రోడ్డు విస్తరణ పనులకు ముహుర్తం ఖరారు చేసి ముందుకు సాగుతున్నారు. సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రం కావడంతో గత మూడేళ్లుగా వివిధ పనుల కోసం వచ్చి పోయే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 50 ఏళ్లకు ముందు నిర్మించిన రోడ్లే తప్ప జనాభా పెరుగుదలకు అనుగుణంగా వాటి విస్తరణ చేపట్టలేదు. గత 23 సంవత్సరాలుగా రోడ్ల విస్తరణ చేపట్టాలని పాలకులు నిర్ణయించినా అమలుకు నోచుకోలేదు. విస్తరణ చేపడుతామనగానే వ్యాపారులు కోర్టుకు వెళ్లి స్టేలు పొందడం, పరిహారం చెల్లిస్తేనే విస్తరణ చేపట్టాలని డిమాండ్లు మొదలు కావడంతో పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం రోడ్ల విస్తరణలపై సిఎం కెసిఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలతో తాజా మాజీ మున్సిపల్ పాలకవర్గం రోడ్ల విస్తరణ చేపట్టాలని తీర్మానం చేసింది. సూర్యాపేట పట్టణములో ప్రధానంగా మూడు రహదారులను విస్తరించాలని ప్రతిపాదించింది. వీటిలో పాత జాతీయ రహదారి అయిన నేటి మెయిన్‌రోడ్డు పోస్టాఫీసు నుండి పిఎస్‌ఆర్ సెంటర్ వరకు 100 ఫీట్ల రహదారిగా మార్చాలని, శరభమ్మ హోటల్ నుండి కుడకుడ రోడ్డు వరకు 80 ఫీట్లు, కోర్టు చౌరస్తా నుండి ఈద్గా రోడ్డు మీదుగా రాఘవా ప్లాజా వరకు నిర్మించే రోడ్డును 100 ఫీట్లు చేసేందుకు పాలక వర్గం తీర్మానం చేసి ప్రకటించి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శికి నివేదిక అందజేశారు. దీనిలో భాగంగా మొదట పాత జాతీయ రహదారి అయిన పోస్టాఫీసు నుండి పిఎస్‌ఆర్ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
రోడ్ల విస్తరణకు వ్యతిరేకం కాదంటున్న స్థిరాస్తి వ్యాపారులు :
రోడ్డు విస్తరణకు తాము వ్యతిరేకం కాదని స్థిరాస్తిదారులు ముందుగానే ప్రకటించారు. కాకుంటే తాము పెద్దఎత్తున నష్టపోతున్నామని దీంతో స్థిరాస్తిదారులు పెద్దఎత్తున తమ ఆస్తులను నష్టపోతామని తమకు పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని,అధికారులను వేడుకున్నారు.వీరి విన్నపాన్ని విన్న ప్రజాప్రతినిధులు స్పందించి ఎవరికి నష్టం వాటిళ్ళకుండా ఎవరూ ఊహించని విధం గా పరిహారం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. పూర్తిగా నష్టపోయే వారి కి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించే ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్‌లో షాపులను కేటాయిస్తామని చెప్పారు.కానిఈ పరిహారం చెల్లింపు విషయమై ఇప్పుడు వారెవ్వరూ నోరుమెదపడం లేదు. దీనిపై భవనాలు కోల్పోయే స్థిరాస్తిదారులు మాత్రం వారు ఇచ్చిన నాటి హామీలు ఏమైయ్యాయని ప్రశ్నిస్తున్నారు.నోటీసులు ఇచ్చిన అధికారులను నిలదీస్తున్నారు.
పరస్పర విరుద్ధంగా అధికారుల ప్రకటనపై స్థిరాస్తిదారుల్లో ఆందోళన
ప్రజాప్రతినిధులు ఎవరూ ఊహించని విధంగా పరిహారం ఇచ్చి ఆదుకుంటామని ఇచ్చిన మాటకు అధికారులు నేడు చెబుతున్న మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. పరిహారం చెల్లింపులేమి ఏమిలేవంటూ అధికారులు తెగేసి చెబుతున్నారు. దేశంలో ఎక్కడా కూడా విస్తరణలో పరిహారం చెల్లించిన దాఖలాలు లేవని స్వయంగా జిల్లా కలెక్టర్ డి అమయ్‌కుమార్ స్థిరాస్తిదారులతో సమావేశం నిర్వహించి చెప్పకనే చెప్పారు. ప్రజాప్రతినిధులు అలా.. అధికారులు ఇలా.. చెప్పడంతో స్థిరాస్తిదారులు అయోమయానికి గురౌతున్నారు. రోడ్డు విస్తరణలో తమకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించకుండా ఆత్మహత్యలే శరణ్యమని వ్యాపారులు వాపోతున్నారు. మెయిన్‌రోడ్డులో గజం స్థలం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.50వేలు ఉంటుంది. ఇంత విలువైన ఆస్తులను కోల్పోవడంతో పాటు తమ వ్యాపారాలు కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొంత మంది స్థిరాస్తిదారులు మొత్తం ఆస్థిని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడనుంది. మెయిన్ రోడ్డు విస్తరణలో దాదాపు 384మంది నష్టపోనున్నారు. ఇందులో అనేక మ ంది పూర్తిస్థాయిలో తమ ఆస్తులను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి కుటుంబాలు వీధిన పడనున్నాయి. పరిహారం చెల్లించమని ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ఆర్ అండ్ బి అధికారులు మెయిన్ రోడ్డు గతంలో హైద్రాబాద్ నుండి మచిలీపట్నం వరకు 9వ జాతీయ రహదారిగా ఉందని ఆనాడు రోడ్డు 150 ఫీట్లు ఉండగా అందరూ ఖబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టారంటూ నోటీసులు జారీచేయడంతో స్థిరాస్తిదారులలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఆనాడు150ఫీట్లు రోడ్డు వెడల్పు ఉంటే సూర్యాపేటకు బైపాస్ రోడ్డు ను ఎందుకు నిర్మిస్తారని స్థిరాస్తిదారులతోపాటు ప్రజలు కూడా ప్రశ్నను లెవనెత్తుతున్నారు. తాము ఖబ్జా చేసి భవనాలు నిర్మిస్తే మున్సిపల్ అధికారులు తమపై ఎందుకు చర్యలు తీసుకోలేదని స్థిరాస్తిదారులు వాధిస్తున్నారు. వ్యా పారులు మాత్రం తమకు పరిహారం చెల్లించిన తర్వాత రోడ్ల విస్తరణ చేపట్టాలని అధికారులను వేడుకుంటూ దుకాణాల ముందు బోర్డులను ఏర్పాటు చే సి తమ అభ్యర్థనను తెలుపుతున్నారు. స్థిరాస్తుదారుల పక్షాన ప్రతిపక్షాలు నిలబడి ఆస్తులు కోల్పోతున్న వారికి పరిహారం అందించి రోడ్ల విస్తరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో అధికార పార్టీ నాయకులు రోడ్డు విస్తరణను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయంటూ ప్రతి విమర్శలు చేస్తూ సోషల్‌మీడియా,పత్రికలకు ఎక్కుతున్నారు. వీరి మాటలతో రోడ్డు విస్తరణకు కాస్త రాజకీయ రంగు పులుముకుంది.అధికారులు మాత్రం ఆదివా రం (నేడు) రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు.
పరిహారంపై పరిహాసమా?
RELATED ARTICLES