నేడే జడ్‌పిటిసి, ఎంపిటిసిల ఓట్ల లెక్కింపు
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
123 కేంద్రాలు : 978 కౌంటింగ్ హాళ్లు
11,882 మంది సూపర్‌వైజర్లు
23,467 మంది అసిస్టెంట్ల నియామకం
ప్రజాపక్షం / హైదరాబాద్ : పల్లె వాసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విలేజ్ లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు మంగళవారం ఏం జరుగుతుంది, తమ భవిష్యత్తు ఏమిటి అనే టెన్షన్ మధ్య కాలం గడుపుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా పల్లె వాసుల్లో ఇదే తరహా ఉత్కంఠ నెలకొన్నప్పటికీ అవి పార్టీ రహిత ఎన్నికలు కావడంతో రాజకీయంగా పెద్ద వేడి రాజుకోలేదు. ఎవరు గెలిచినా తమ ఖాతాలో వేసుకోవచ్చనే ధీమా రాజకీయ పార్టీలదైతే… ఫలితాల వెంటనే ఓటమి పాలయ్యామన్న అప్రతిష్ట వెనువెంటనే రాదనే భావన కూడా రాజకీయ పక్షాల్లో ఉండడం ఇప్పుడంత ఉత్కంఠను కలిగించలేదు. కానీ ప్రస్తుతం ఎంపిటిసి, జడ్‌పిటిసి ఫలితాలు మం గళవారం వెలుబడనున్నాయి. ఈ ఎన్నికలు పూర్తిగా పార్టీల గుర్తులతో జరిగాయి. తొలుత అధికార పార్టీ ఈ ఫలితాలు ఏకపక్షంగా తమ వైపే ఉంటాయని భావించింది. కారణం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకుని ఈ అంచనాకు వచ్చింది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా అధికార పార్టీకి ప్రజలు చుక్క లు చూపించారు. ఉనికే కోల్పోయిందన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను తిరిగి రేసులోకి తేగా, అసలు తెలంగాణలో అంతగా ప్రభావమే లేదు అన్న బిజెపి.. అధికార పార్టీకి చుక్కలు చూపించి ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు జరిగాయి. దీంతో అదే తరహా తీర్పును కనుక ప్రజలు ఇస్తే ఏంటన్న ఆందోళన అధికార పార్టీ టిఆర్‌ఎస్‌లో నెలకొనగా, అంతకు మంచి తీర్పు వస్తే ఇక తమకు తిరుగులేదు, పుంజుకోవచ్చు అన్న భావన కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీల్లో ఉంది. దీంతో గల్లీ లీడర్ నుంచే కాదు… ఢిల్లీ లీడర్ వరకు కూడా తెలంగాణ పరిషత్ ఫలితాలపై తెగ ఆసక్తి చూపుతుండడంతో పాటు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.