పట్టుబడిన ప్రముఖుల పిల్లలు?
ప్రజాపక్షం/హైదరాబాద్ జిల్లా ప్రతినిధి
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఒక పబ్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక కూడా పార్టీ జరుగుతుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న పబ్‌లో అర్ధరాత్రి దాటిన తరువాత లేట్ నైట్ డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పబ్‌పై మెరుపుదాడులు నిర్వహించారు. సోదాల్లో డ్రగ్స్ వినియోగం గుట్టు రట్టయ్యింది. పబ్ బాత్ రూముల్లో డ్రగ్స్ వాడి పాడేసిన ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్‌ను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు రావడంతో యువతీ యువకులు కిటికీలోంచి పారేసిన 12 ప్యాకెట్ల డ్రగ్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పబ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారుల పిల్లలు పట్టుపడడం హాట్ టాపిక్ మారింది. ఫుడింగ్ మింక్ పబ్‌కు డ్రగ్స్ సరఫరాపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో పోలీసులు పరిశీలిస్తున్నారు. పబ్‌లోని సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో యువకులు హంగామా సృష్టించారు. తమను ఎందుకు తీసుకువచ్చారంటూ ఆందోళనకు దిగారు. అయితే విచారణ అనంతరం కొందరిని విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నామని, రిపోర్టుల ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
పబ్‌లో ప్రముఖులు ర్యాడిసన్ హోటల్ సెల్లార్‌లో నిర్వహించే ఫుడింగ్ అండ్ మింక్ పబ్ తేజస్వీ, కిరణ్ రాజు, సతీష్ రాజు పేర్లతో రిజిస్టర్ కాగా ఇటీవల పబ్‌ను అభిషేక్ ఉప్పాల లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఫ్లోర్ మేనేజర్‌గా కునాల్ వ్యవహరిస్తున్నాడు. ఇతడు బయట నిర్వహించే పార్టీలకు కూడా ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఈ పబ్‌లో నిర్వహించిన లేట్‌నైట్ పార్టీకి 142 మంది హాజరైనట్లు పోలీసులు గుర్తించగా మొత్తం 157 మందిని అదుపులోకి తీసుకున్నారని వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఐదుగురు విదేశీయులు అరోయి లోపెజ్, ఈవా తెరాన్, నురియా మావర్రో, మయాలెన్ గోంజాలో, మరినా అచెవాతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టిడిపి ఎంపి గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్దార్ధ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా పబ్‌లో నటి నిహారిక, సికిందరాబాద్ మాజీ ఎంపి ఎం.అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు ఎం.అనిల్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి కూతురు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
పోలీసు కమిషనర్ అత్యవసర భేటీ
హైదరాబాదులో ఇటీవల డ్రగ్స్ ప్రకంపనలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కు బానిసై ఓ బీటెక్ విద్యార్థి మరణించిన కొన్నిరోజులకే నగరంలోని ఫుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేయగా, అనేకమంది ప్రముఖుల పిల్లలు పట్టుబడడం సంచలనం సృష్టించింది. దాంతో ఈ కేసును తెలంగాణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నారు. తాజాగా, నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వెస్ట్ జోన్ పరిధిలోని ఎస్‌ఐలు, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్లు వెంటనే రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. కాగా, పబ్ లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఈ కేసుకు సంబందించిన సాంకేతిక ఆధారాలపై వెస్ట్ జోన్ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ కేసును నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో పబ్ మేనేజర్ కునాల్ పాత్రపై పోలీసులు దృష్టి పెట్టారు. పార్టీకి డ్రగ్స్‌తో వచ్చిన వారికి సెక్యూరిటీ క్లియర్ చేయించింది కునాలేనని భావిస్తున్నారు. స్టఫ్, సోడా, బ్రో, కూల్ వంటి సంకేత నామాలతో డ్రగ్స్ సరఫరా చేసినట్టు అనుమానిస్తున్నారు. పార్టీకి డ్రగ్స్‌తో వచ్చిన వారితో కునాల్ అనేక పర్యాయాలు ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించారు. ఈ అంశాలపైనా పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి.
డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలిపెట్టం: పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్
నగరంలో కలకలం రేపిన డ్రగ్స్ పార్టీలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ చెప్పారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలి పెట్టమని ఆయన స్పష్టం చేశారు. పోలీసలు దాడిలో దొరికిన వారిలో 45 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నామని అన్నారు. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారని సిఐ శివచంద్రను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఎసిపి సుదర్శన్‌కు చార్జ్ మెమో జారీ చేశామని వెల్లడించారు.
నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారు : నాగబాబు
నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని నటుడు నాగబాబు కోరారు. “పబ్‌లో నిహారిక ఉండడం వల్లే నేను స్పందిస్తున్నాను. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారనే పోలీసులు చర్యలు తీసుకున్నారు. నా కూతురు నిహారిక విషయంలో అంతా క్లియర్. నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పారు. ఊహాగానాలకు తావివ్వకూడదనే దీనిపై స్పందిస్తున్నాను. ఈ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను” అని నాగబాబు ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు.
డ్రగ్స్ కేసుతో నాకేం సంబంధం లేదు : సినీ నటి హేమ
పబ్‌లో పార్టీ, డ్రగ్స్ పట్టుపడిన కేసులో అనవసరంగా తన పేరును ప్రస్తావిస్తున్నారని డ్రగ్స్ వ్యవహారంపై సినీ నటి హేమ అభ్యంతరం చెప్పారు. ఏ సంబంధం లేని తనను ఎందుకు బదనామ్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఆ పబ్ కు తాను వెళ్లనేలేదని, కానీ, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తనపై అభాండాలు వేస్తూ పేరును ప్రసారం చేస్తున్నాయని హేమ ఆరోపించారు. ప్రముఖులను వదిలేసి తనపై నిందలు మోపడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నా కొడుకుకు డ్రగ్స్ పార్టీకి సంబంధం లేదు : అంజన్‌కుమార్ యాదవ్
హోటల్ రాడిసన్‌లో బర్త్ డే పార్టీకి తన కుమారుడు వెళ్లాడని, అయితే డ్రగ్స్ పార్టీకి తన కొడుకుకు సంబంధం లేదని కాంగ్రెస్ నేత ఎం.అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. కావాలనే తన కుమారుడిని ఇందులో ఇరికిస్తున్నారని అన్నారు. అసలు లేట్ నైట్ పార్టీలు జరిగితే వైఫల్యం ఎవరిదని ఆయన ప్రశ్నించారు. పబ్‌లు తెల్లవారుజాము వరకు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ప్రభుత్వం వెంటనే పబ్‌లన్నీ మూసివేయాలని అంజన్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
పుడింగ్ మింక్ పబ్ వ్యవహారంలో రంగంలోకి నార్కోటిక్ వింగ్
జంటనగరాల్లో డ్రగ్స్ కలలకం రేపిన పుడింగ్ మింక్ పబ్ వ్యవహారంలో నార్కోటిక్ అధికారులు రంగంలోకి దిగారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి చౌహన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. డ్రగ్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక పరికరాన్ని నార్కోటిక్ అధికారులు వినియోగిస్తున్నారు. కాగా పబ్‌లో క్లూస్ టీమ్ సోదాలు నిర్వహించి శాంపిల్ సేకరించారు. ఈ సందర్భంగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో డ్రగ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
పబ్‌లో డ్రగ్స్
RELATED ARTICLES