జిహెచ్‌ఎంసి కాంట్రాక్టర్ల అల్టిమేటం
కొవిడ్-19 సహా అన్ని పనులు బంద్ చేస్తాం
ఆరు నెలలుగా అందని బిల్లులు
ఇంకా మంజూరు కాని గతేడాది నాలాల పూడికతీత బిల్లులు
పేరుకుపోయిన రూ.350 కోట్ల బకాయిలు
పనులు ఆపేస్తే రూ.200 కోట్ల పనులపై ప్రభావం
ప్రజాపక్షం/ హైదరాబాద్ : మౌలిక సౌకర్యాలకు సంబంధించిన అభివృద్ధి పనుల బిల్లులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జిహెచ్‌ఎంసి)లో ఆరు నెలలుగా మంజూరు కావడం లేదు. మరోవైపు బాడా కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం లాక్‌డౌన్ సమయంలో సైతం మంజూరు అవుతున్నాయ ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరు నెలలు గా బిల్లులు మంజూరు కాకపోవడంతో చెతిలో ఉన్న డబ్బులు మొత్తం పనులకు వెచ్చించడం వల్ల కొత్త పనులు చేపట్టేందుకు వీలు లేకుండా పోయిందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఆరు నెలలుగా బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిపేయాలని కాంట్రాక్టర్లు నిర్ణయించారు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు ఇవ్వనందున పనులు అపేస్తామని జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్‌కు లేఖ అందజేశారు. నాలుగు రోజుల్లోగా బిల్లుల విషయం తేల్చకపోతే ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తామని కాంట్రాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా అత్యవసర పనులు మొదలుకొని, నాలాల పూడికతీత, ఫుట్‌పాత్‌లు, సిసి, బిటి, విడిసిసి తదితర మౌలిక సౌకర్యాలకు సంబంధించిన పనులకు సంబంధించి నగర వ్యాప్తంగా ప్రస్తుతం రూ.200 కోట్ల పనులు జరుగుతున్నాయి.
పనులు బంద్ చేయడం తప్పనిసరైంది…
బిల్లులు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితు ల్లో పనులు ఆపేయాల్సిన పరిస్థితులు వచ్చాయని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (జిహెచ్‌ఎంసి) అధ్యక్షులు ఎ.దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్.హనుమంత్‌సాగర్‌లు స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న సిఆర్‌ఎంపి రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పనులు జరుగుతున్న తరుణంలో బాడా కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్ట్ పనులకు కూడా బిల్లులు మంజూరు చేసిన్నప్పుడు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖమంత్రి కె.టి.రామారావు ఎవ్వరికి చెప్పితే వారికే బిల్లులు మంజూరు చేస్తున్నారని దామోదర్‌రెడ్డి, హనుమంత్‌సాగర్‌లు ఆరోపించారు. తాము పనులు పూర్తి చేసి ఆరునెలలు దాటిపోయిందన్నారు. గత సంవత్సరం నాలాల పూడికతీతకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. కొవిడ్ పనుల్లో భాగంగా పోలీసులకు టెంట్‌లు, తాగునీరు, బోజన వసతి, కంటైన్‌మెంట్ జోన్‌లలో బారికేడింగ్ లాంటి అత్యవసర పనులు కూడా చేస్తున్నామని చెప్పారు. బిల్లులు ఇవ్వకపోగా మరోసారి నాలాల పూడికతీత పనులు చేయ్యాలని తమపై ఒత్తిడి తీసుకవస్తున్నారని అన్నారు.
నాలుగు రోజుల్లో తెల్చకపోతే సిఆర్‌ఎంపి పనులు సైతం అపేస్తాం…
తమకు నాలుగు రోజుల్లో బిల్లులు మంజూరు చేయకపోతే తాము చేపట్టిన నాలాల పూడికతీత, రోడ్ల నిర్మాణంతో పాటు సిఆర్‌ఎంపి పనులను కూడా అపేస్తామని దామోదర్‌రెడ్డి, హనుమంత్‌సాగర్‌లు అన్నారు. చిన్న కాంట్రాక్టర్ల తక్కువ మొత్తంలో ఉండే బిల్లులు అపేసి, బాడా కాంట్రాక్టర్లకు చెందిన ఎజెన్సీలకు తక్షణమే బిల్లులు ఇస్తూ తమ పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పూర్తయిన తరువాత బిల్లులు రావాలంటే కనీసం ఆరునెలల సమయంలో పడుతుందన్నారు. మౌలిక సౌకర్యాలైన సిసి, బిటి రోడ్లు, డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల డ్రెయిన్‌లు, ఫుట్‌పాత్‌లు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నారు. బిల్లులు మంజూరు చేయడంలో ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్(ఫైనాన్స్) నుంచి మొదలుకొని జోనల్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ల వరకు వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఎక్కడికక్కడ కమీషన్‌లు ఇచ్చినా… సకాలంలో బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది జోనల్ కమిషనర్లు ఉద్దేశపూర్వకంగానే బిల్లుల జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తమలో కొందరు ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తున్నారని, వారికి సకాలంలో బిల్లులు అందకపోవడంతో వడ్డీలు చెల్లించడంతో భారంగా మారుతుందన్నారు. బ్యాంకు రుణాల ద్వారా తీసుకున్న యంత్రాలు, వాహనాలు, ఇతర సామాగ్రికి తాము చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు.