ప్రజాపక్షం/హైదరాబాద్ కొవిడ్ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల విధానంలో విద్యాశాఖ పలు మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న 11 పరీక్షలను ఆరుకు కుదించింది. ఫైనల్ పరీక్షల్లో 80 మార్కలు, ఇంటర్‌నల్‌లో 20 మార్కులు ఉంటాయని స్పష్టంచేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రరామచంద్రన్ విధి విధానాలను ఖరారు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ద్వితీయ భాష మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు ఇంతకు ముందు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రథమ భాష, ఆంగ్లం, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాలకు 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లను ఇవ్వాలని ఎస్‌ఎస్‌సి బోర్డుకు విద్యాశాఖ సూచించింది. పరీక్ష సమయాన్ని కూడా మరో అరగంట పొడిగించారు. ఇంతకు ముందు 2 గంటల 45 నిమిషాల పాటు పరీక్ష సమయం ఉండగా. ఈ ఏడాది 3 గంటల 15 నిమిషాలు పాటు సమయాన్ని కేటాయించనున్నారు. సైన్సు పరీక్షలో విద్యార్థులకు రెండు సమాధాన పత్రాలనిస్తారు. ప్రశ్నపత్రం పార్ట్ ‘ఎ’లోని భౌతిక శాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు ఒకదానిలో, పార్ట్ ‘బి’లోని జీవశాస్త్రం సమాధానాలు మరో దానిలో రాయాలి. మార్కుల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే ఎఫ్‌ఎ పరీక్షలకు 20, బోర్డు పరీక్షకు 80 మార్కులు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది.
పదోతరగతిలో ఆరు పరీక్షలే
RELATED ARTICLES