HomeNewsBreaking Newsపది రోజుల్లో ‘రైతుబంధు’

పది రోజుల్లో ‘రైతుబంధు’

నా ప్రాణం ఉన్నంత వరకు రైతుబీమా, ఉచిత విద్యుత్‌ ఆగదు
రాష్ట్రంలో ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదాలకే పరిమితం
జగిత్యాల జిల్లా మోతె బహిరంగసభలో సిఎం కెసిఆర్‌
ప్రజాపక్షం/జగిత్యాల ప్రతినిధి
ప్రపంచంలోనే ‘రైతుబంధు’ ‘రైతు బీమా’ అందిస్తున్న ఏకైక ప్రాంతం తెలంగాణ మాత్రమేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతుల బాగుకోసం కెసిఆర్‌ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబీమా పథకాలు కొనసాగుతాయ ని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. యాసంగి సీజన్‌లో మరో 10 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతా ల్లో రైతుబంధు నిధులు జమ అవుతాయని సిఎం ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో 49 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవానికి బుధవారం విచ్చేసిన సిఎం కెసిఆర్‌, మోతె గ్రామం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే 16 రాష్ట్రాల్లో బీడి కార్మికులు ఉన్నారని ఎక్కడా లేనివిధంగా వందల కోట్ల ఖర్చు చేస్తూ బీడి కార్మికులకు నెలకు 2,016 రూపాయలు పెన్షన్‌ పంపిణీ చేస్తున్నామని, వీటితో పాటు ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మీ, కెసిఆర్‌ కిట్‌ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని సిఎం కెసిఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజలు దేశంలో జరుగుతున్న అంశాలను పరిశీలించాలని, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌ కోసం దేశ రాజకీయాలను మనం ప్రభావితం చేయాలన్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదంగా మాత్రమే మిగిలిపోయిందని, దీపావళి పటాస్‌లు, పతంగి మంజాలు, చివరికి జాతీయ జెండాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని సిఎం తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదాలు చేస్తున్నా ప్రతి ఊరిలో చైనా బజార్లు ఉన్నాయని వీటిపై మేధావులు, యువకులు మహిళలు, ఉపాధ్యాయులు చర్చించాలని సిఎం కెసిఆర్‌ కోరారు. పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లను విక్రయిస్తూ 35 లక్షల కోట్ల ఆస్తి కలిగిన ఎల్‌ఐసి విక్రయానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, గత 8 సంవత్సర కాలంలో బడాబాబులకు 14 లక్షల కోట్ల రూపాయల ఎన్‌పిఎ రుణాలు మాఫీ చేశారని, 10వేల ఫ్యాక్టరీలు మూతబడ్డాయని, 50 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సిఎం కెసిఆర్‌ అన్నారు. 25 లక్షల ఏజెంట్లు కలిగిన ఎల్‌ఐసి విక్రయాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. లక్షల కోట్ల ప్రజా సంపదతో ఏర్పాటు చేసిన విద్యుత్‌ వ్యవస్థల ప్రైవేటీకరణణకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అంగీకరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు వల్ల రాష్ట్రం దాదాపు 3 లక్షల కోట్లు నష్టపోయిందని, తెలంగాణ రాష్ట్రం తరహాలోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తే మన జిఎస్‌డిపి 14.5 లక్షల కోట్లకు చేరేదని సిఎం తెలిపారు. తలసరి విద్యుత్‌ వినియోగం తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని, కరీంనగర్‌ జగిత్యాల జిల్లాలో ఎంఎల్‌ఎలకు అదనంగా 10 కోట్ల ఫండ్‌ మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. కొండగట్టు దేవాలయానికి కేవలం 20 ఎకరాల స్థలం మాత్రమే ఉందని, నూతన రాష్ట్రంలో పక్కన ఉన్న 384 ఎకరాలను సైతం దేవాలయానికి అందించామని, పెరుగుతున్న ఆంజనేయస్వామి భక్తులను దృష్టిలో ఉంచుకోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ త్వరలో శాస్త్రాల ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. వేములవాడలో 3 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సూరమ్మ చెరువు లిప్ట్‌, చొప్పదండి నియోజకవర్గ పరిధిలో మల్యాల మండలం మద్దుట్ల గ్రామం వద్ద లిప్ట్‌ పనులను త్వరలో మంజూరు చేస్తామని సిఎం హామీనిచ్చారు. పోతారం, నారాయణపూర్‌ రిజర్వాయర్‌ పనులు ధర్మపురి నియోజకవర్గంలో రొల్లవాగు ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. బండలింగాపూర్‌ గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల మాత్రమే జగిత్యాల ప్రత్యేక జిల్లాగా ఆవిర్భావించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యమ సమయంలో ధర్మపురి వద్ద పుష్కర స్నానం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రార్థించామని, లక్ష్మీ నరసింహస్వామి దయతో ప్రత్యేక రాష్ట్రం సాధించామని అన్నారు. గోదావరి నది తెలంగాణలో ప్రారంభమైనప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు పుష్కరాలు నిర్వహించలేదని, ప్రత్యేక రాష్ట్రంలో ఘనంగా పుష్కరాలు నిర్వహిస్తే కోట్లాదిమంది భక్తులు వచ్చి పుష్కర స్నానాలు చేశారని, మంత్రి హారీష్‌రావు క్షేత్రస్థాయిలో ట్రాఫిక్‌ పోలీస్‌ లా సేవలు అందించిన అంశాలను సిఎం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌కుమార్‌, పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్‌ నేతకాని, శాసనమండలి సభ్యులు టి.భానుప్రసాద్‌రావు, ఎల్‌ రమణ, కల్వకుంట్ల కవిత, పాడి కౌశిక్‌రెడ్డి, శాసనసభ్యులు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సుంకే రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, బాల్క సుమన్‌, జడ్‌పి చైర్‌ పర్సన్‌ దావ వసంత, జగిత్యాల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments