లక్షణాలున్న వారికి 72 గంటల్లో పరీక్షలు చేయాలి
పది రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ
కొవిడ్ టెస్టులు పెంచాలని రాష్ట్రాలకు సూచన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న పదిరాష్ట్రాలు వైరస్‌ను కట్టడి చేయగలిగితే కరోనాపై భారత్ విజయం సాధించినట్లేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితులు, అన్‌లాక్ అమలుపై మంగళవారం పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో దాదాపు 80శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయన్నారు. ఈ సమయంలో పది రాష్ట్రాలు వైరస్‌ను కట్టడి చేయగలిగితే కరోనా పోరులో భారత్ విజయం సాధించినట్లేనని పునరుద్ఘాటించారు. అందుకే ఈ రాష్ట్రాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని సూచించారు. ముఖ్యంగా బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తెలంగాణల్లో కొవిడ్ టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని, పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో టెస్టులసంఖ్య భారీగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్ లక్షణాలున్న వ్యక్తిని 72 గంటల్లోగా గుర్తించి పరీక్షిస్తే వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే వైరస్ నిర్దారణ అయిన వ్యక్తిని కలిసిన వారు కూడా 72 గంటల్లోపే పరీక్షలు చేయించుకోవాలని ప్రధాని సూచించారు. వైరస్‌ను కట్టడిచేయడం, కాంటాక్ట్ ట్రేసింగ్, పర్యవేక్షణలే వైరస్ పోరులో కీలక ఆయుధాలని మరోసారి చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు పెరగిందని మరణాల రేటు తగ్గుతున్నాయన్నారు. లాక్‌డౌన్ తరువాత పరిస్థితులు, అన్‌లాక్-3 అమలు జరుగుతున్న తీరుతెన్నులను పది రాష్ట్రాల సిఎంలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
పది రాష్ట్రాల్లో కట్టడి చేయగలిగితే కరోనాపై విజయం మనదే
RELATED ARTICLES