నామినేటెడ్ పోస్టుల భర్తీకి కెసిఆర్ కసరత్తు
ప్రజాపక్షం/ హైదరాబాద్ : నామినెటెడ్ పదవుల నియమాకానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వ తెరలేపింది. మంత్రివర్గ విస్తరణతో పాటు కొన్ని ముఖ్యమైన నామినెటెడ్ పదవులను కూడా భర్తీ చేసేందుకు టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ కసరత్తు మొదలు పెట్టారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఎల్‌ఎలుగా పోటీ చేసిన అభ్యర్థులు ఆర్‌టిసి, ప్రణాళిక సంస్థ, ఎస్‌సి కార్పొరేషన్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, మిషన్ భగీరథ తదితర పలు నామినెటేడ్ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండవ సారి కొలువుదీరిన తర్వాత మొట్టమొదటి సారిగా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. త్వరలోనే మరిన్ని నామినెటెడ్ పదువులను కూడా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఎంఎల్‌ఎలుగా అవకాశం రాని వారికి నామినెట్ పదవులలో అవకాశం కలిస్తామని ఎన్నికల సమయంలో పలువురు నేతలకు పార్టీ నుంచి హామీ లభించినట్లు తెలిసింది. దీంతో నామినెట్ పదవుల కోసం పలువురు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావును పలువురు కలుస్తున్నారు.గత ప్రభుత్వంలో(2014- నామినెటెడ్ పదవుల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. అయితే రెండవ సారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నామినెటెడ్ పదవుల విషయంలో జాప్యం చేయకుండా ముందుగా వాటిని ప్రకటించాలని కెసిఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మంత్రివర్గ విస్తరణకు ముందుగానే సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించడంతో ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొన్నది. అయితే రెడ్డి సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రత్యేంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్‌కు తాజా మాజీ మంత్రిని నియమిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమైన నాయకులకు, కొందరు ఎంఎల్‌ఎలకు కూడా నామినెటెడ్ పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని వృత్తులకు సంబంధించిన కార్పొరేషన్ ఛైర్మన్లుగా ఆ వృత్తులకు సంబంధించిన వారినే నిమించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.