మార్కెట్ కార్యదర్శిని నిలదీసిన అన్నదాతలు
ఎనుమాముల మార్కెట్‌కు పోటెత్తిన పత్తి
ప్రజాపక్షం/వరంగల్ ప్రతినిధి ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయిన వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్ కు పత్తి భారీగా తరలి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ధర తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ కార్యదర్శిని నిలదీశారు. మార్కెట్‌లో పత్తి ధర గురువారం రూ. 7720 పలికితే శుక్రవారం రూ.7650కి తగ్గిం ది. ఈ క్రమంలో పత్తి ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. గత పది రోజుల్లోనే క్వింటాపై దాదాపు రూ.700 పతనం అంచుకు చేరింది. చేతికొచ్చిన అరకొర పంటను మార్కెట్‌కు తీసుకువస్తే ధర తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వరుసగా ఆరు రోజులు సెలవు లు రావడంతో శుక్రవారం మార్కెట్‌కు పత్తి పోటెత్తింది. ఇదే అదునుగా అడ్తి, ఖరీదు వ్యా పారులు అధికారులతో కుమ్మక్కై కావాలనే ధర తగ్గిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే వర్షాలు, చీడపీడల నుండి కాపాడుకొని మార్కెట్‌కు పత్తి తీసుకువస్తే సరైన ధర రావడం లేదని రైతులు వాపోయారు. జెండా పాట అనంతరం ధర నిర్ణయాన్ని చూసి కొనుగోళ్లు నిలిపివేయాలని కొంతమంది రైతులు ఆందోళన చేసేందుకు యత్నించగా అధికారులు వారికి నచ్చజెప్పారు. మార్కెట్ కార్యదర్శి వ్యాపారస్తులకు కొమ్ముకాస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సరైన ధర రాకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ తనిఖీలు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పత్తి ధర తగ్గింపుపై రైతుల ఆగ్రహం
RELATED ARTICLES