ఆరుతడి పంటలపై రైతుల అనాసక్తి
కోతుల బెడదతో వెనుకడుగు
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో పప్పుదినుసుల సాగు నానాటికీ పడిపోతుంది. ఆరుతడి పంటలపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఓ వైపు కోతుల బెడదతో సాగుకు దూరమవుతున్న పరిస్థితి నెలకొనగా గతం కంటే నీటి వనరులు అధికంగా పెరగడంతో తరి పంటల సాగుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం పంట సాగు విస్తీర్ణం 6.06 లక్షల ఎకరాలు కాగా, ఇందులో అధికంగా వరి 4.25 లక్షల ఎకరాలు కాగా రెండవ స్థానంలో పత్తి 98 వేల ఎకరాల్లో రైతులు వానా కాలంలో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. గతంలో జిల్లాలో తరిపంటల సాగు కన్నా మెట్టపంటల సాగే అధికంగా జరిగేది. పప్పుదినుసులను రైతులు అధికంగా సాగు చేసేవారు. కానీ ఆ రోజులు పోయాయి. ఆరుతడి పంటలు సాగు అంటేనే రైతులు ఆసక్తి చూపని పరిస్దితి ఏర్పడింది. గత ఏడాది (2020) వానా కాలంలో 37.84 వేల ఎకరాల్లో పెసర పంటను రైతులు సాగు చేయనున్నారని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా కేవలం 12.86 వేల ఎకరాలు మాత్రమే పెసర సాగైంది. ఈ వానా కాలంలో 11,484 ఎకరాలలో రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేసినా సగానికి పడిపోయింది. కేవలం 6,565 ఎకరాల్లో మాత్రమే పెసర పంటను రైతులు సాగు చేశారు. ఇదిలా ఉంటే కంది పంట సాగు కూడా నిత్యం తగ్గిపోతున్నది. 2020 వానా కాలం సాధారణ విస్తరణ 25.35 వేల ఎకరాలు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 19.03 వేల ఎకరాలు మాత్రమే సాగుకు నోచుకుంది. ఈ ఏడాది 18,869 ఎకరాల్లో కంది సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేసినప్పటికీ కేవలం 9,141 ఎకరాలు మాత్రమే పంట సాగైంది. అధికారులు వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే నానాటికి పప్పు దినుసుల సాగు పడిపోతుందన్న విషయం స్పష్టమవుతున్నది.
ఆరుతడి పంటలపై ఆసక్తి చూపని రైతన్న
ఆరుతడి పంటలపై రైతులు ఆసక్తి చూపడం లేదు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలు క్రిష్ణా పరివాక ప్రాంతాలు కావడంతో ఇక్కడ అధికంగా రైతులు వరిని సాగు చేసే వారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో గత మూడేళ్ళ క్రితం వరకు ఏలాంటి జల వనరులు లేకపోవడంతో ఈ ప్రాంత రైతాంగం అధికంగా మెట్ట పంటల సాగుకే మొగ్గు చూపింది. ప్రధాన పంట సాగు పెసరా, కంది ఉండేంది. నేడు ఆ పరిస్దితులు లేకుండాపోయాయి. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో గోదావరి, మూసీ నీరు ప్రవహిస్తుంది. దీంతో రైతులు తరిసాగుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానంగా వరిని సాగు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే రికార్డు స్ధాయిలో పంట దిగుబడి సాధిస్తున్నారు.
కోతుల బేడదతో వెనుకడుగు
కోతుల బేడదతోనే పెసర, కంది పంటల సాగుకు తాము దూరం అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీనికి తోడు నీటి వనరులు పెరగడంతో పప్పుదినుసుల సాగుకు ఆసక్తి చూపడం లేదు. పంట సాగుకు పెట్టుబడి తక్కువ… దిగుబడి ఎక్కువగా ఉన్నా వరి సాగుపైనే మొగ్గు చూపుతున్నారు. పెసర, కంది పంటలు సాగు చేస్తే పంట చేతికి అందగానే కోతుల మంద చేనుపైపడి మేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలో అడవులకే పరిమిత్తమైన వానర సైన్యం చేతికి అందిన పైరును ధ్వంసం చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని అందుకే ఈ పంటలను సాగు చేయడం లేదని రైతులు చెబుతున్నారు.
పడిపోయిన పప్పుదినుసుల సాగు
RELATED ARTICLES