బాహుబలి తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయి పెరిగింది. అంతవరకు ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ ప్రతియేటా నిర్మిస్తున్న సినిమాల సంఖ్య సగటున 200 ఉన్నప్పటికీ, హిట్లు సంఖ్య మాత్రం గణనీయంగా పడిపోతున్నది. చిన్న సినిమాల్లోనూ పది శాతం మించి హిట్లు లేకపోగా, పెద్ద సినిమాల్లో సూపర్‌హిట్లు గగనమైపోతున్నది. గడిచిన ఏడాది కూడా ఇదే పరిస్థితి కన్పిస్తున్నది. 2019వ సంవత్సరంలో ఏకంగా 184 సినిమాలు విడుదల కాగా, అందులో పట్టుమని 10 సినిమాలు కూడా సూపర్‌హిట్ టాక్‌కు నోచుకోలేదు. పెద్ద నిర్మాతలు సైతం ఎదురుదెబ్బలు తిన్న సందర్భాలు గోచరించాయి. పెద్దహీరోలుగా చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో కేవలం వెంకటేష్ మాత్రమే రెండు సినిమాలు తీసి, రెండింటిలోనూ సూపర్‌హిట్లు కొట్టాడు. చిరంజీవి అతిపెద్ద సినిమా సైరాతో బరిలోకి దిగినప్పటికీ, ఆశించినంత గొప్ప హిట్ కాలేకపోయింది. కాకపోతే ఖర్చుపెట్టిన డబ్బులు చేతికి రావడంతో నిర్మాత రామ్‌చరణ్ సంతోషపడ్డారు. ఎన్‌టిఆర్ జీవిత కథతో రెండు సినిమాలు తీసిన బాలకృష్ణను ఆ రెండూ నిరాశపర్చగా, ఏడాది ఆఖరులో వచ్చిన రూలర్ మాత్రం ఊరటనిచ్చింది. నాగార్జునకు ఆ ఊరట కూడా లేదు. నిజానికి హిట్లు వేరు, కలెక్షన్లు వేరు. సాె మూవీ కలెక్షన్లలో నెంబర్‌వన్‌గా నిలిచినప్పటికీ, సినిమా పరంగా తెలుగులో ఆదరణ పొందలేకపోయింది. అయితే ఆ సినిమా బాలీవుడ్‌లో పెద్దహిట్‌గా నిలిచింది. కలెక్షన్ల టాప్ 10లో వినయ విధేయ రామ సైతం నిలిచినప్పటికీ, అది పెద్ద అట్టర్‌ఫ్లాప్‌గా నమోదైంది. తక్కువ లేదా ఓ మాదిరి బడ్జెట్‌లో తీసిన ఎవరు?, 118, బ్రోచేవారెవరురా, చిత్రలహరి, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, నినువీడని నీడను నేను, ఇద్దరి లోకం ఒకటే, కౌసల్య కృష్ణమూర్తి, కొబ్బరిమట్ట వంటి సినిమాలు అటు మంచి సినిమాలుగాను, థ్రిల్లర్లుగానూ నిలుస్తూనే, కాసులు కురిపించాయి.
సూపర్‌హిట్స్2019
1. ఎఫ్2
2. మహర్షి
3. ఇస్మార్ట్ శంకర్
4. ప్రతి రోజూ పండగే
5. గద్దలకొండ గణేష్
6. మజిలీ
7. వెంకీమామ
8. జెర్సీ
9. ఎవరు?
10. హే బేబీ
11. 118
12. బ్రోచేవారెవరురా?
సూపర్ కలెక్షన్లు 2019
1. సాె (రూ. 433.06 కోట్లు)
2. సైరా నర్సింహారెడ్డి (రూ. 250 కోట్లు)
3. మహర్షి (రూ. 175 కోట్లు)
4. ఎఫ్2 (రూ. 137.6 కోట్లు)
5. వినయ విధేయ రామ (రూ. 97.9 కోట్లు)
6. ఇస్మార్ట్ శంకర్ (రూ. 83 కోట్లు)
7. వెంకీ మామ (రూ. 72 కోట్లుఇంకా రన్నింగ్‌లో వుంది)
8. మజిలీ (రూ. 70 కోట్లు)
9. జెర్సీ (రూ. 61.70 కోట్లు)
10. గద్దలకొండ గణేష్ (రూ. 42.5 కోట్లు)
కుర్రహీరోలదే హవా!
2019లో యువహీరోలకే జనం నీరాజనాలు పలికారు. నాగచైతన్య నటించిన మజిలీ, వెంకీమామ సినిమాలు రెండూ హిట్లు కాగా, అతని తమ్ముడు అఖిల్ మరోసారి మిస్టర్ మజ్నూతో నిరాశపరిచాడు. నాని జెర్సీ చిత్రంతో మంచి హిట్ అందుకోగా, గ్యాంగ్‌లీడర్‌తో యావరేజ్ సాధించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ వినూత్న కథతో 118 సినిమా చేసి, అందర్నీ థియేటర్లకు రప్పించాడు. మెగాఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్‌కు కలిసొచ్చిన సంవత్సరమిది. చిత్రలహరి సినిమాతో శుభారంభం పలికి, ప్రతిరోజూ పండగే సినిమాతో ఈ ఏడాది అతిపెద్ద హిట్‌తో ముగించాడు. ఈ సినిమా అతని కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మల్లేశం, బ్రోచేవారెవరురా? సినిమాలో కుర్రహీరోలు మంచి హిట్లు సాధించారు. ఇక రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్‌తో తన కెరీర్‌లోనే ఒక పెద్ద హిట్‌ను కొట్టాడు. హిట్ల కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఈ సినిమా రిలీఫ్‌నిచ్చింది. అడివి శేష్ ఎవరు? సినిమాతో మరో కొత్త ప్రయత్నం చేయడంతోపాటు భారీగా డబ్బులు రాబట్టుకున్నాడు. శర్వానంద్ రణరంగం పెద్దగా ఆడలేదు. కార్తికేయ గుణ 369, 90 ఎంఎల్ మూవీలు పెద్దగా ఆకట్టుకోలేకపోగా, అతిచిన్న సినిమా కొబ్బరిమట్ట హిట్టయింది. నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం, ఏడాది ఆఖర్లో వచ్చిన మత్తు వదలరా సినిమాలు హిట్లయ్యాయి. ఇక కన్నడ సినిమా జిగర్తాండ రీమేక్‌తో వచ్చిన వరుణ్‌తేజ్ గద్దలకొండ గణేష్ మూవీ అతని స్థాయిని భారీగా పెంచింది. బహుశా ఈ ఏడాది ఉత్తమ నటుడు అతనే కావచ్చు. అలాగే ఎఫ్2 మల్టీస్టారర్‌మూవీతోనూ పెద్ద హిట్ కొట్టేశాడు. హీరోలతో పనిలేకుండా సమంత సోలోగా వచ్చిన హే బేబీ సినిమా ఒక మంచి చిత్రంగా నిలవడమే కాకుండా, గల్లాపెట్టెను బాగానే నింపింది. సమంత ఈఏడాది మజిలీ, హే బేబీలతో హాయిగా కెరీర్‌ను కొనసాగించింది.
పెద్దహీరోల్లో నిలిచిందెవరు?
నాగార్జున మన్మథుడు2 అట్టర్‌ఫ్లాప్ కావడం అక్కినేని ఫ్యాన్స్‌కు నిరాశే మిగిల్చింది. బాలకృష్ణ గొప్ప ప్రయత్నంగా ఎన్‌టిఆర్ జీవితకథతో తీసిన ఎన్‌టిఆర్ కథానాయకుడు, ఎన్‌టిఆర్ మహానాయకుడు సినిమాలు ఒక మహావ్యక్తిని మరోసారి ప్రజలకు గుర్తుచేసినప్పటికీ, డబ్బులు పరంగా బాలకృష్ణకు ఈ రెండు మూవీలు నష్టాలనే మిగిల్చాయి. అయితే డిసెంబరులో వచ్చిన బాలకృష్ణ మరోసినిమా రూలర్ మాత్రం అతని ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకునేలా చేసింది. చిరంజీవి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత రెండోసినిమాగా భారీ బడ్జెట్‌తో తీసిన సైరా నర్సింహారెడ్డి తెలుగు పరిశ్రమ స్థాయిని, డిజిటల్ వర్క్ క్వాలిటీని నిలబెట్టినప్పటికీ, అందర్నీ థియేటర్లలోకి రప్పించలేకపోయింది. కాకపోతే ఒక మంచి సినిమాగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా గొప్ప లాభాలు రప్పించలేకపోయినా, తెలుగు సినిమాకు భారీతనాన్ని తీసుకువచ్చింది. రామ్‌చరణ్ ఒకే ఒక్క సినిమా వినయ విధేయ రామతో రంగంలోకి దిగినా, అది బాక్సాఫీసు వద్ద నిలవలేకపోయింది. మహేష్‌బాబు మహర్షి మాత్రం కమర్షియల్ హిట్‌ను సాధించింది. కలెక్షన్లలోనూ, ఆదరణలోనూ, మ్యూజికల్ సెన్స్‌లో అత్యధిక మార్కులు కొట్టేసింది. 2019లో అందరికన్నా అదృష్టవంతుడైన పెద్ద హీరో వెంకటేష్ ఒక్కరే. ఎఫ్2తో సంవత్సరానికి శుభారంభం పలికిన వెంకీ ఏడాది ఆఖర్లో వెంకీమామతో మరో హిట్టు కొట్టేశాడు.