రైలు ప్రమాదంలో 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో కార్మికుల పైనుంచి దూసుకెళ్లిన గూడ్స్
ప్రాణాలతో బయటపడిన మరో నలుగురు
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
కేంద్ర ప్రభుత్వ అలసత్వమే కారణమన్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : వలస కార్మికులను లాక్‌డౌన్ మృత్యువు రూపంలో కబలిస్తోంది. తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందలాది కిలోమీటర్లు కాలి నడకన వెళ్తూ మృత్యువాత పడుతుండగా, మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్తుండగా, అలసిపోయిన వారు మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో రైలు పట్టాలపై నిద్రిస్తుండగా ఓ గూడ్స్ రైలు వారిపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 మంది వలస కార్మికులు దుర్మరణం పాలైనట్లు పోలీసులు చెప్పారు. ఔరంగాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్మాడ్ సమీపంలో శుక్రవారం ఉదయం 5.15 గంటలకు ప్రమాదం చోటు చేసుకుందని, ప్రమాదం నుంచి మరో నలుగురు వలస కార్మికులు ప్రాణాలతో బయటపడినట్లు వారు చెప్పారు. నిద్రిస్తున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో వారి మృతదేహాలు, వారికి సంబంధించిన కొత్తిపాటి వస్తువులు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటన నుంచి ప్రాణాలతో బయటడిన వలస కార్మికులు రైలు పట్టాలపై నిద్రిస్తున్న తమ సహచరులను లేపేందుకు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నం ఫలించలేదని జిల్లా పోలీస్ చీఫ్ మోక్షద పిటిఐ వార్తా సంస్థకు వెల్లడించారు. మహారాష్ట్రలోని జాల్నా నుంచి వలస కార్మికులు మధ్యప్రదేశ్‌లోని భుస్వాల్ చేరుకునేందుకు రైలు పట్టాల గుండా నడిచి వస్తున్నట్లు కర్మాడ్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు చెప్పారు. మార్గమధ్యలో విశ్రాంతి కోసం రైలు పట్టాలపై నిద్రిస్తుండగా జాల్నా నుంచి బయలుదేరిన గూడ్స్‌రైలు వారి పైనుంచి దూసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. కాగా, జాల్నాలోని స్టీల్ కంపనీలో పని వలస కార్మికులు గురువారం రాత్రి తమ స్వస్థలానికి బయలుదేరారని, ఈ క్రమంలో కర్మా డ్ చేరుకున్న వారు అసలట చెందిన పట్టాలపై నిద్రిస్తున్నట్లు పోలీస్ అధికారి సంతోష్ ఖెట్మాల్స్ పేర్కొన్నారు. నలుగురిలో ముగ్గురు కార్మికులు రైల్ పట్టాలకు కొద్దిదూరంలో నిద్రించినట్లు ఆయన చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల లాక్‌డౌన్ విధించడంతో వలస కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే వారం తా తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఇదిలా ఉం డగా, రైలు ప్రమాదంలో 16 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “రైలు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీల విషయంలో తీవ్ర బాధగా ఉంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నా” అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. కాగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మరణించిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 నుంచి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాక్రే వలస కార్మికుల మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదే విధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా సంతాపాన్ని ప్రకటిస్తూ మృతుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వలసకార్మికులు దుర్మరణాన్ని హృదయ కోతగా ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ అభివర్ణించారు.