పంపిణీ కాని పట్టాదారు పాస్‌పుస్తకాలు
కలెక్టర్‌లు ఆగ్రహించినా మారని తీరు
కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
ప్రజాపక్షం/వరంగల్ : పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కాక రైతు లు పడరాని పాట్లు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది రైతులకు పూర్తిస్థాయిలో పట్టాదారు పాసుపుస్తకాలు నేటికీ పంపిణీ కాలేదు. దీంతో నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇటీవల ప్రజావాణిలో పలుమార్లు రైతులు ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్‌లకు తమకు పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదని మొరపెట్టుకున్న సంఘటనలు ఎదురయ్యాయి. దీంతో జిల్లా కలెక్టర్‌లు సైతం రెవెన్యూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జిల్లాలో ఒక ప్రహసనంలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సదాశయం అధికారుల తీరు కారణంగా క్షేత్రస్థాయిలో నీరుగారుతున్న పరిస్థితి ఏర్పడింది. కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ముందస్తు పెట్టుబడి రూపం లో రైతులకు ఆర్థిక చేయూతను అందిస్తున్నది. రైతుబంధుతో పాటు రైతుబీమాతో అండగా నిలుస్తున్నది. ఈ క్రమంలో భూప్రక్షాళన చేప ట్టి అర్హులైన రైతులకు వారి భూములకు పట్టాదారు పుస్తకాలు అందించే కార్యక్రమం చేపట్టింది. కానీ ఇది పూర్తి స్థాయిలో అందక రైతు లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలలో నేటికీ అనేక మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 9,37,600 పట్టాదారు ఖాతాలు ఉండగా, 6,88,727 పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఇంకా 2,48,879 పాసుపుస్తకాలు అందజేయాల్సి ఉంది. ఒక్క వరంగల్ అర్బన్ జిల్లాలోనే 1,31,210 ఖాతాలు ఉండగా వీటిలో 1,03,673 ఖాతాల రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంజూ రీ చేశారు. మరో 27537 ఖాతాలు పార్ట్ బి భూములకు సంబంధించినవి ఉన్నాయి. పాసు పుస్తకాలలో తప్పులు సవరించడంలో జాప్యం కారణంగానే పంపిణీ కావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి నుండి మొదలుకొని జిల్లా కలెక్టర్‌ల వరకు పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో అన్నదాతలు మండలాలలోని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో పనిచేసే విఆర్‌ఒలపైనే ప్రధాన బాధ్యత ఉన్నప్పటికీ వారు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుండడంతో వారు తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. ఈ క్రమంలో పలువురు విఆర్‌ఒలు రైతుల నుండి డబ్బులను డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంపిణీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలలో కూడా పేర్లు, సర్వే నెంబర్‌లు, విస్తీర్ణం విషయాలలో తప్పులు దొర్లడంతో రైతులు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. వాటిని కూడా అధికారులు పంపిణీ చేయడంలో జాప్యం జరగడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రైతుల అవసరాలను ఆసరా గా చేసుకొని రెవెన్యూ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు.