ఓటు నమోదు పేరుతో సర్టిఫికెట్ల సేకరణ
అయినా నమోదుకాని ‘ఓటు’ : పట్టభద్రుల్లో టెన్షన్
ప్రజాపక్షం/హైదరాబాద్ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై సర్వత్రా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్‌సి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ‘పట్టభద్రుల’ ఓటు కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే గాలం వేస్తున్నాయి. ఓటరు నమోదుతో పట్టభద్రులకు చెందిన జిరాక్స్ సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ జిరాక్స్ సర్టిఫికెట్లను తీసుకుంటున్న నేతలు వాటి ని ఎంత వరకు భద్రంగా పెడుతారా? లేదా ఏమైనా దుర్వినియోగానికి పాల్పడుతారా? అనే అంశం ప్రస్తు తం పట్టభద్రులను వేదిస్తోంది. తమ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే స్థానిక నేతలతో కంటు కావడం, అలా కాదని వారి చేతిలో సర్టిఫికెట్లను పెడితే ఒక వేళ ఏమైనా దుర్వినియోగానికి పాల్పడితే భవిష్యత్‌లో ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు అయిష్టంగానే తమ సర్టిఫికెట్లను రాజకీయ నేతల చేతికి ఇస్తున్నారు. మిగతా వారు మాత్రం తాము ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకుంటామని ఖరాకండిగా సమాధానమిస్తున్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ప్రధానంగా అధికార టిఆర్‌ఎస్ నేతలు పెద్ద మొత్తంలో పట్టభద్రుల నుంచి సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. ఓటరు నమోదు విషయంలో టిఆర్‌ఎస్ అధిష్ఠానం స్థానిక నాయకత్వానికి, నాయకులకు టార్గెట్ విధించడంతో వారంతా తమ తమ స్థానిక ప్రాంతాల్లో అదే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో వారు తమకు తెలిసినవారు, తమ చుట్టుపక్కల ఉన్నవారి వివరాలను తెలుసుకోవడం వారి నుంచి సర్టిఫికెట్లను తీసుకోవడం పనిగా పెట్టుకున్నారు. ఓటరు నమోదు చేసేందుకు సహాయం చేసే అంశం బాగానే ఉన్నప్పటికీ ఒకవేళ ఆ జిరాక్స్ సర్టిఫికెట్లు దుర్వినియోగమయితే అందుకు బాధ్యులు ఎవరు..? దాని ప్రభా వం తమపైనే ఉంటుంది కదా అని పట్టభద్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా పెద్ద మొత్తంలో పట్టభద్రుల నుంచి జిరాక్స్ సర్టిఫికెట్స్‌ను టిఆర్‌ఎస్,బిజెపి ఇతర రాజకీయ పార్టీల నేతలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో స్థానికంగా ఉంటున్న రాజకీయ నేతలు ఆయా కళాశాల యజమాన్యాల వద్దకు వెళ్లి పట్టభద్రుల వివరాలను సేకరిస్తున్నారు. వారి వివరాల ఆధారంగా ఓటరు నమోదు చేయడం ఆ తర్వాత పట్టభద్రుల నుంచి తమకే ఓటు వేయాలని హామీ కూడా తీసుకుంటున్నట్టు పలువురు చెబుతున్నారు. ఓటరు నమోదులో భాగంగా స్థానిక నేతలు తమ వివరాలను, జిరాక్స్ పేపర్లను వసూలు చేసినప్పటికీ తమ పేర్లను నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని కొందరు పట్టభద్రులు వాపోతున్నారు. ఇంతకు తమ ఓటును నమోదు చేస్తారా? లేదా అలాగే కాలాన్ని వృదా చేసి చివరకు ఓటు లేకుండా చేస్తారా అని కొందరు అనుమానిస్తున్నారు.
పట్టభద్రుల పట్టాల జిరాక్స్‌లు నేతల చేతికి…
RELATED ARTICLES