వరంగల్ అర్బన్ జిల్లాలో గోడ కూలి చిన్నారి మృతి
ప్రజాపక్షం/వరంగల్‌బ్యూరో ; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఓ ప్రొక్లునర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల ఎనిమిది సంవత్సరాల బాలిక మృత్యువాత పడింది. పట్టణ ప్రాంతా ల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఉరుకులు పెట్టేంచేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ మహానగర కార్పొరేషన్ పరిధిలో హన్మకొండ పట్టణంలో పలు డివిజన్లలో రోడ్లపక్కన పిచ్చిచెట్లు తొలగింపు, రహదారుల చదును కార్యక్రమాలు జెసిబి యంత్రాల సహాయంతో చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం హన్మకొండలోని కొత్తూరుజెండా 43వ డివిజన్ పరిధిలో ప్రొక్లునర్‌తో రహదారిని చదును చేస్తుండగా పక్కనే ఉన్న ప్రహారీగోడ కూలి ఓ చిన్నారిపై పడింది. అయితే ఆ రహదారి పనులు జరుగుతున్న సమయంలో చిన్నారులు గోడ పక్కన ఆడుకుంటూ ఉండగా ప్రొక్లునర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో గోడకు గుద్దడంతో గోడ కూలి అక్కడే ఆడుకుంటున్న ప్రిన్సి అనే ఎనిమిది సంవత్సరాల బాలికపై పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు ఆడుకుంటున్న రెండేళ్లున్న ఆమె తమ్ముడు బాబుకు కూడా తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన బాలిక రెండో తరగతి చదువుతోంది. చిన్నారి బాలిక ప్రిన్సి తండ్రి సాంబశివరావు ఫిర్యాదు మేరకు ప్రొక్లునర్ డ్రైవర్ సత్యప్రకాష్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు హన్మకొండ సిఐ దయాకర్ తెలిపారు.