హైదరాబాద్, వరంగల్ వంటి పట్టణాలకు ప్రత్యేక ప్యాకేజీనైనా కేటాయించండి
కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కెటి రామారావు విజ్ఞప్తి
రాష్ట్రంపై ఉన్న వివక్షతోనే ఇప్పటి వరకు ఒక్క రూపాయీ ఇవ్వలేదని ఆవేదన
ప్రజాపక్షం/హైదరాబాద్ రానున్న కేంద్ర బడ్జెట్‌లో (2023- తెలంగాణ రాష్ట్ర పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించాలని పురపాలక శాఖమంత్రి కెటి రామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న వివక్షతోనే కేంద్ర నుంచి ఇప్పటి వరకు అదనంగా ఒక్క రూపాయీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, వరంగల్, ఇతర పురపాలికల నిమి త్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, లేదా హైదరాబాద్, వరంగల్ వంటి పట్టణాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీనైనా కేటాయించాలన్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధికి సహకరించాలని ఇది వరకే అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, తమ ప్రతిపాదనలు పంపించిన ప్రతిసారీ తమకు నిరాశే ఎదురవుతుందన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటు అందించేలా వచ్చే బడ్జెట్‌లోనైనా సరిపడేలా నిధులను కేటాయించాలన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొండి చెయ్యి చూపినా, పురపాలికలతో పాటు అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి ప్రయాణాన్ని కొనసాగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అవార్డుల నేపథ్యంలో ఇప్పటికైనా తమ ప్రభుత్వ పనితీరును మోడీ సర్కార్ గుర్తించిందనే ఆశాభావంతో మరిన్ని నిధులు కేటాయిస్తారనే నమ్మకంతోనే తాను లేఖ రాస్తున్నాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పలు పథకాల అమలు తదితర అంశాలను ఆ లేఖలో కెటిఆర్ పేర్కొన్నారు.
నగరంలో మెట్రో రైలు ప్రజలకు అత్యంత అనువుగా మారిన నేపథ్యంలో దానికి అనుసంధానంగా భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టును తలపెట్టామని, రూ.6,250 కోట్ల బడ్జెట్‌తో 31 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ అంగీకారాన్ని వెంటనే మంజూరు చేసి, కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్ రాపిడ్ ట్రాన్‌సిట్ సిస్టమ్ కోసం దాదాపు రూ 3050 కోట్లు ఖర్చు అవుతున్నాయని, ఇందులో 15 శాతం మూలధనం పెట్టుబడిగా రూ 450 కోట్లను కేంద్రం కేటాయించాలని పేర్కొన్నారు. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, ఈస్ట్ వెస్ట్ ఎక్స్ ప్రెస్‌వే (రూ 11500 కోట్లు), ఎస్‌ఆర్‌డిపి రెండవ దశ (రూ 14 వేల కోట్లు), డెవలప్‌మెంట్ ఆఫ్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం,స్కై వేల నిర్మాణం (రూ 9,000 కోట్లు) కోసం అవసరమయ్యే రూ 34,500 కోట్లలో కనీసం పది శాతం (రూ3,450 కోట్లు) ఈ బడ్జెట్‌లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
సమాఖ్య స్ఫూర్తిని చాటుకోవాలి: కెటిఆర్
అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను ప్రోత్సహించి కేంద్ర ప్రభుత్వం తన సమాఖ్య స్ఫూర్తిని చాటుకోవాల్సిన అవసరముందని కెటిఆర్ అన్నారు. రూ 2400 కోట్లతో చేపట్టే 104 లింక్ రోడ్ల నిర్మాణ వ్యయంలో మూడో వంతు (రూ 800 కోట్లు) కేంద్ర ప్రభుత్వం భరించాలని, తెలంగాణ సానిటేషన్ హబ్ నిమిత్తం రూ100 కోట్ల సీడ్ ఫండింగ్ ఇవ్వాలని, మూడవ విడత జిహెచ్‌ఎంసి చేపట్టిన మున్సిపల్ బాండ్స్‌కు కేంద్రం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలను విడుదల చేయాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌లోని రూ 254 కోట్ల బకాయిలను ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలన్నారు. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని పురపాలికల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయోమైనింగ్ వంటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ 3,777 కోట్ల ఖర్చవుతున్న క్రమంలో ఇందులో కనీసం 20 శాతం అంటే రూ. 750 కోట్లను వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలన్నారు. వార్షిక యాక్షన్ ప్లాన్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలో వరదలను అరికట్టే బృహత్తర లక్ష్యంతో చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్‌కు గతంలో రూ 240 కోట్లను అడిగిన విషయాన్ని కూడా పరిశీలించాలన్నారు. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రూ 400 కోట్ల స్వచ్ఛ్ భారత్ మిషన్ నిధులను కేటాయించాలన్నారు.
పట్టణాల అభివృద్ధికి… భారీగా నిధులివ్వండి
RELATED ARTICLES