ఆరు నెలలు జైలు, రూ. 200 జరిమానా విధింపు
ఢిల్లీ సర్కార్ ఉత్తర్వులు జారీ
పోలీసు దాడుల్లో 1400 కిలోలు స్వాధీనం
ఐదుగురు అరెస్టు
రుద్రప్రయోగ్ : దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి బాణసంచా కాల్చితే జైలుకు వెళ్లాల్లిందే. బాణసంచా కాల్చిన వారికి ఆరు నెలలు జైలు శిక్షతోపాటు రూ. 200 జరిమానా కూడా విధించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖమంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. అదే విధంగా ఉత్పత్తి, నిల్వలు, విక్రయాలు జరిపితే రూ. 5 వేల జరిమానాతో పా టు పేలుడు పదార్థాల చట్టంలోని 9బి సెక్షన్ కింద మూడేళ్ల జైలు శిక్ష కూడా ఉంటుందని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాయ్ వెల్లడించారు. సెప్టెంబర్‌లో నగర ప్రభుత్వం అన్ని రకాల బాణసంచా విక్రయాలు, వాడకం, ఉత్పత్తిపై దీపావళి పండుగ సహా జనవరి 1వ తేదీ వరకు పూర్తిగా నిషేధం విధించింది. గత రెండేళ్ల నుం చి ప్రతి దీపావళికి బాణసంచా కాల్చడాన్ని, విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా, ‘దీపాలు వెలిగించండి… పటాకులు కాదు’ అంటూ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ఈనెల 21వ తేదీన ప్రారంభించనున్నట్లు రాయ్ చెప్పారు. శుక్రవారం నాడు కన్నౌట్ ప్రదేశ్‌లోని సెంట్రల్ పార్క్ వద్ద ఢిల్లీ ప్రభుత్వం 51 వేల దీపాలను వెలిగించనుంది. పటాకుల నిషేధాన్ని పటిష్టంగా అమలు పరిచేందుకు 408 బృందాలను ఏర్పాటు చేసినట్లు రాయ్ చెప్పారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు 210 బృందాలను ఏర్పాటు చేయగా, రెవెన్యూ విభాగం 165 బృందాలను, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ 33 బృందాలను ఏర్పాటు చేసింది. ఈనెల 16వ తేదీ నాటికి నిషేధాన్ని ఉల్లంఘించిన కేసులు 188 నమోదయ్యాయని, 2,917 కిలోల పటాకులను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రతికూల వాతావరణ కారకాల కారణంగా ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాలలో గాలి నాణ్యత అక్టోబర్‌లో క్షీణించడం ప్రారంభమవుతుంది. పొరుగు రాష్ట్రాల్లో బాణసంచా కాల్చడం, వ్యవసాయ వర్థాలాను కాల్చడం వల్ల వెలువడే కాక్‌టెయిల్ గాలి నాణ్యతను మరింత దెబ్బతీస్తుంది. ప్రతి ఏడాది దీపావళి నాటికి కాలుష్య స్థాయిలు పెరుగుతాయని, దీనికి అతి పెద్ద కారణం… బాణసంచా కాల్చడమేనని మంత్రి తెలిపారు. పటాకుల నుంచి వెలువడే ఉద్గారాలు చిన్నారులు, మహిళలు, వృద్ధులు అత్యంత ప్రమాదకరమైనవన్నారు. అందువల్ల ఢిల్లీ ప్రభుత్వం వాటి ఉత్పత్తి, విక్రయం, వాడకంపై ఈ ఏడాది కూడా పూర్తిగా నిషేధం విధించిందన్నారు. ఆన్‌లైన్ బాణసంచా విక్రయాలను కూడా నిషేధించామని చెప్పారు.
1400 కిలోల పటాకులు స్వాధీనం, ఐదుగురు అరెస్టు
ఢిల్లీలో పటాకులపై నిషేధాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ ఆపరేషన్‌లలో ఐదుగురిని అరెస్టు చేయడమే కాకుండా 1400 కిలోల బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. వాయువ్య, ఆగ్నేయం, దక్షిణ జిల్లాల్లో పోలీసు బృందాలు జరిపిన ఆపరేషన్లు నిర్వహించారన్నారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కన్హయ్య నగర్‌లో అమక్రంగా బాణసంచా విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. వచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన వెళ్లి గాలించి ఓ బ్యాగులో పూర్తిగా పటాకులను నింపుకొని వెళ్తున్న కన్హయ్య నగర్ నివాసి మోహిత్ గుప్తా (22)ను త్రినగర్‌లో పట్టుకున్నామన్నారు. అనంతరం అని నివాసంలో సోదాలు నిర్వహించి 570 కిలోల పటాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా దక్షిణ జిల్లా పోలీసులు మంగళవారం నాడు మదన్‌గిర్ సెంట్రల్ మార్కెట్‌లోని ఓ దుకాణంలో పెద్ద మొత్తంలో బాణసంచాను నిల్వ ఉంచిన దినేష్ చంద్ (63)ను కూడా అరెస్టు చేశామన్నారు. ఆ దుకాణం నుంచి మొత్తం 250 మేరకు స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి (దక్షిణ) చందన్ చౌదరి తెలిపారు. మరో చోట కూడా 217.48 కిలోల అక్రమ పటాకులను స్వాధీనం చేసుకొని సుభం గుప్తా (24), పవన్ అరోరా (24)ను అరెస్టు చేసినట్లు డిసిపి ఇషా పాండే చెప్పారు. ఇంకో ప్రదేశంలోనూ 423 కిలోలను పట్టుకున్నారు.
పటాకులు పేల్చితే జైలుకే…
RELATED ARTICLES