సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వేటు
ఫైర్ సర్వీసెస్ డిజిగా బదిలీ
ఉన్నతాధికారుల కమిటీలో నిర్ణయం
ఖర్గే అసమ్మతికి విలువ లేకుండాపోయింది
2-1 తేడా నిర్ణయంతో వర్మ తొలగింపు
సుప్రీంకోర్టు తీర్పుతో బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే ఉద్వాసన
మళ్లీ సంక్షోభంలో సిబిఐ వ్యవస్థ
ఇది అన్యాయం : ప్రతిపక్షాల విమర్శ
న్యూఢిల్లీ: సిబిఐ డైరెక్టర్‌గా అలోక్ కుమార్ వర్మను పునర్నియమిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పి రెండు రోజులైనా కాకముందే గురువారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత కమిటీ ఆయనను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 1979 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన వర్మ బుధవారమే మళ్లీ సిబిఐ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సివిసి) ఇచ్చిన రిపోర్టును పరిశీలించి ఆయన పదవీలో కొనసాగాలో కూడదో వారంలోగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ వర్మ జనవరి 31న రిటైర్ కావలసి ఉంది. రెండు రోజుల్ల రెండోసారి సమావేశమైన ఉన్నత స్థాయి కమి టీ ఆయనను సిబిఐ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుందని అధికారులు చెప్పారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డ్‌కు చెందిన ఫైర్ సర్వీసెస డైరెక్టర్ జనరల్(డిజి)గా వర్మను నియమించారు. అదనపు డైరెక్టర్ అయిన ఎం. నాగేశ్వర రావుకు సిబిఐ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభు త్వం గురువారం సాయంత్రం ఉత్తర్వు జారీచేసింది. అలోక్ వర్మపై ఎనిమిది ఆరోపణలున్నట్లు సివిసి తన రిపోర్టును ఉన్నత కమిటీకి సమర్పించింది. ‘సిబిఐ నెం. 1 చేతుల గుండా డబ్బు మార్పిడి జరిగింది’ అని మాట్లాడుతున్న సంభాషణ తాలూకు రిసెర్చ్ అనాలిసిస్ వింగ్(రా) ఇంటర్‌సెప్ట్ వివరాలను కూడా సివిసి తన రిపోర్టులో చేర్చింది. దళారి మనోజ్ ప్రసాద్‌ను ‘రా’లో సెకండ్-ఇన్-కమాండ్‌గా ఉన్న సమంతా గోయల్ పేరును కూడ పేర్కొంది. ఈ కేసులో దాదాపు రూ. 36 కోట్లు చేతులు మారినట్లు, ఇందులో వర్మ కూడా ఉన్నట్లు సివిసి పేర్కొంది. ఉన్నత కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నామినీలుగా ఉన్నారు. రెండు గంటలపాటు సమావేశమైన కమిటీ 2-1 తేడా తీర్పుతో అలోక్ వర్మపై వేటువేసింది. మల్లికార్జున ఖర్గే ఒకరే ఆయన తొలగింపును వ్యతిరేకించారు.