ఏటా కోట్లాది రూపాయల పంట నష్టం
తీవ్రంగా నష్టపోతున్న రైతాంగం
పరిహాసమవుతున్న పరిహారం
అంచనాలతో సరిపెడుతున్న పాలక వర్గాలు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో: వ్యవసాయ రంగం కూనారిల్లుతోంది. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు ధర ఉన్న పంట పండక ఏడాదికేడాది రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కష్టాలు, నష్టాలే తప్ప వ్యవసాయంలో కలిసొచ్చిన దాఖలాలు లేవు. గతంలో ధర ఎక్కువో తక్కువో కానీ వ్యవసాయోత్పత్తులను బాగా నే కొనుగోలు చేసేవారు. కానీ ఇటీవల వ్యవసాయోత్పత్తులను విక్రయించడానికి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రకరకాల ఇబ్బందులతో సతమతమవుతున్నా రైతాంగంపై ప్రకృతి పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంది. ఒక రకంగా సహాయ నిరాకరణ జరుగుతుంది. కావాల్సినప్పుడు కరుణించని మేఘం అనవసర సమయాల్లో కుండపోతగా వర్షించి రైతును కుంగదీస్తుంది. తొలకరి సమయంలో వర్షం అదునులో పడకపోవడం ఆ తర్వాత విత్తు నాటకుండా భారీ వర్షాలు కురవడం, తిరిగి ముఖం చాటేయడం ఆనవాయితీగా వస్తుంది. పత్తి, అపరాలు, మొక్కజొన్న, ధాన్యం, మిర్చి పంటలు చేతికందే దశలో అకాల వర్షం రావడం రైతాంగాన్ని కడగండ్లపాలు చేయడం వరుసగా నాలుగేండ్ల పాటు జరుగుతుంది. చేలోనే పంట దెబ్బతిన్న సందర్భాలు చోటు చేసుకున్నాయి. మొక్కజొన్న, అపరాలు, ధాన్యం మొక్కలు వచ్చి నల్లబడి కొనే నాధుడే లేని పరిస్థితులను రైతాంగం చవిచూసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సైతం వసతులు కల్పించకపోవడంతో వ్యవసాయోత్పత్తులు అకాల వర్షాలకు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో పట్టాలు లేకపోవడం, మార్కెట్ యార్డులలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద సైతం షెడ్ల నిర్మాణం జరగకపోవడం నష్టానికి కారణమవుతుంది. గడచిన ఐదేండ్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయోత్పత్తులు తడిసిపోతూనే ఉన్నాయి. కానీ శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవడంలో మాత్రం వైఫల్యం చెందుతున్నారు. ఇక మామిడి, బొప్పాయి, నిమ్మ, పామాలిన్ మొదలైన పండ్ల తోటలు ప్రకృతి విలయానికి దెబ్బతింటున్నాయి.